ఉద్యమ పురిటిగడ్డపై మరో పోరాటానికి వ్యూహరచన

-టీఆర్‌ఎస్‌ది ఒంటరిపోరా ? ఉమ్మడి పోరా ..?
-సంఘీభావ ప్రతినిధులుగా జేఏసీ ప్రతినిధులను ఆహ్వానిస్తారా ?
-ఇస్తే సంబరం.. లేదంటే సమరం
-రెండోదే ఫైనల్‌ చేసిన కేసీఆర్‌ !
కరీంనగర్‌ వేదికగా సింహగర్జన సభతో 2001లో ఆవిర్భవించిన టీఆర్‌ఎస్‌ అదే గడ్డపై నుండి మరో చారిత్రాత్మక పోరాటానికి అడుగులు వేస్తోంది..పార్టీ ఎన్ని ఆటుపోటులకు ఎదురైనా వెన్నంటి నిలిచిన పోరాటాల పురిటి గడ్డ కరీంనగర్‌ జిల్లా ప్రజల సాక్షిగా, తనకు అచ్చొచ్చిన జిల్లానే వేదికగా చేసుకొని టీఆర్‌ఎస్‌ మరోసారి ఉధృత పోరుకు రెడీ అవుతోంది..2009లో మొదలైన మలి దశ తెలంగాణ ఉద్యమంలో విద్యార్థి లోకం, ఉద్యోగ, ఉపాధ్యాయ జేఏసీల ఉధృత పోరాటం తర్వాత కేంద్ర ప్రభుత్వం డిసెంబర్‌ 9 ప్రకటనను చేసింది..అయితే పార్లమెంట్‌ సాక్షిగా తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీని నిలబెట్టుకోలేక అభాసుపాలైంది…ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలని ప్రపంచంలో ఏదేశంలో కూడా జరగని స్థాయిలో సహాయనిరాకరణ ఉద్యమం, సకల జనుల సమ్మెలు జరిగాయి..అదే కోవలో మిలియన్‌ మార్చ్‌, సెప్టెంబర్‌30న జరిగిన తెలంగాణ మార్చ్‌లో సైతం ప్రజలు
భారీగా పాల్గొని తమ ఆకాంక్షను చాటారు. ఉప ఎన్నికల్లోనూ ప్రజలు టీఆర్‌ఎస్‌కు పట్టం కట్టి తెలంగాణావాదాన్ని ఘనంగా వ్యక్తం చేశారు. అదిగో..ఇదిగో అంటూ కేంద్రం తెలంగాణపై తాను చేసిన ప్రకటనకు ఎక్కడా కట్టుబడలేదు..దీనికి తోడు ఢిల్లీలోని కాంగ్రెస్‌ నాయకులు తెలంగాణపై అడ్డదిడ్డమైన ప్రకటనలు చేసారు. పుండు మీద కారం చల్లినట్లు ఆజాద్‌, వయలార్‌ రవిలు ఎక్కడి తెలంగాణ అంటూ ప్రకటనలు చేయడం, తెలంగాణ సమస్య జఠిలమైందంటూ పనికిమాలిన ప్రకటనలు చేయడం తెలంగాణ ప్రజల ఆగ్రహాన్ని రెట్టింపు చేసింది…అయితే తెలంగాణ వచ్చే ఈ దశలో పోరాటాలెందుకంటూ, దసరాలోగా తెలంగాణ వస్తుందని కేసీఆర్‌ ధీమా వ్యక్తం చేశారు. ఒకవేళ దసరా ముగిశాక ఇస్తే సంబరం, ఇవ్వకపోతే సమరం అంటూ కొత్త నినాదాన్ని తెరపైకి తెచ్చారు. అయితే దసరా ముగిసినా తెలంగాణ పై సానుకూల ప్రకటన రాలేదు. దీంతో కేంద్రం చర్చల పేరుతో కాలయాపన చేసిందని కేసీఆర్‌ ఆగ్రహంగా ఉన్నారు. ఇస్తే సంబరాలు చేద్దామన్న కేసీఆర్‌ తెలంగాణ ప్రకటన రాకపోవడంతో ఇక సమరానికి సిద్ధం చేస్తున్నాడు. ఆదిశగానే పావులు కదిపేందుకు కరీంనగర్‌లో జరగనున్న మేధోమదన సదస్సులో నిర్ణయాలు తీసుకోకున్నారు. తమ పార్టీకి జన్మనిచ్చిన కరీంనగర్‌ నుంచే మరో భారీ పోరాటానికి ఆయన సిద్ధమవుతున్నారు. అయితే ఈసారి సాదా సీదా గా కాకుండా ప్రజలతో కలిసి ఉద్యమాలను తీవ్రతరం చేసే దిశగా అధినేత కేసీఆర్‌ వ్యూహం రచిస్తున్నారు. ఇందులో భాగంగా పార్టీ ముఖ్య నేతలతో చర్చించి కీలక నిర్ణయాలు తీసుకునేందుకు రాష్ట్ర కార్యవర్గ సమావేశాలను కరీంనగర్‌లో నిర్వహిస్తున్నారు. ఇప్పటివరకు సకలజనుల సమ్మె, సహాయ నిరాకరణ ఉద్యమం వంటి ఎన్నో భారీ పోరాటాలను కేంద్రం నుంచి ఎలాంటి ప్రకటన రాకున్నా అర్దంతరంగా విరమించడంపై ఆత్మవిమర్శ చేసుకొని భవిష్యత్తులో ఉద్యమాలను మరింత పటిష్టంగా నిర్మించే ప్రయత్నంలో ఉన్నట్లు సమాచారం. అంతేకాక ప్రభుత్వం నుండి ప్రకటన వెలువడేవరకూ పోరాటాన్ని విరమించొద్దని కేసీఆర్‌ ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది..తెలంగాణలో ఉధృత పోరాటం తర్వాత డిసెంబర్‌ 9న చేసిన ప్రకటన నుంచి వెనక్కి తగ్గిన తర్వాత ఐక్య ఉద్యమాల వైపు దృష్టి సారించిన టీఆర్‌ఎస్‌ రాజకీయ ఏర్పాటు ఆవశ్యకతను, ఐక్యంగా ఉద్యమాలు చేయాలన్న చారిత్రక సత్యాన్ని గుర్తించింది..అందుకే అన్ని పార్టీల భాగస్వామ్యంతో రాజకీయ జేఏసీ ఏర్పాటు చేసేందుకు నిర్ణయించారు. ఒకే ఉమ్మడి లక్ష్యం కోసం పోరాడుతున్న ఉమ్మడి శక్తులన్నింటినీ ఒకే వేదికపై ఆహ్వానించి పోరాటం చేయాలని తలిచారు. అయితే అప్పటికే ఓయూలో జరుగుతున్న తెలంగాణ పోరాటంలో కీలక పాత్ర పోషిస్తున్న కోదండరాంను అన్ని పార్టీల ఆమోదంలో జేఏసీ చైర్మన్‌గా చేశారు. అప్పటి నుండి జరుగుతున్న ఉద్యమంలో జేఏసీ భాగస్వామ్య పక్షాలు కీలక పాత్ర పోషిస్తూ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నాయి..టీఆర్‌ఎస్‌, న్యూడెమొక్రసీ, బీజేపీలు ఇప్పటికీ జేఏసీలో కొనసాగుతున్నాయి..మొదట జేఏసీలో టీడీపీ, కాంగ్రెస్‌ చేరినా బాబు రెండు కళ్ల సిద్ధాంతం, తెలంగాణ న్యాయవాదులపై టీడీపీ శ్రేణుల దాడితో జేఏసీ నుండి టీడీపీని బహిష్కరించారు. రాజీనామాలపై కాంగ్రెస్‌ ప్రతినిధులు దొంగాట ఆడుతుండడంతో ఆపార్టీని కూడా సస్పెండ్‌ చేశారు. అయితే తెలంగాణకు మద్ధతుగా నిర్ణయం తీసుకున్న సీపీఐ జేఏసీకి బయట నుండి మద్ధతు ఇస్తోంది..ఇటీవల జరిగిన సెప్టెంబర్‌ మార్చ్‌లో సైతం సీపీఐ చురుగ్గా పాల్గొంది..గతంలో జరిగిన మహబూబ్‌నగర్‌ ఉప ఎన్నికలలో జేఏసీ తటస్థ వైఖరి అవలంబించడం కేసీఆర్‌కు కోపాన్ని తెప్పించింది. అప్పటినుండే టీఆర్‌ఎస్‌కు జేఏసీకి మధ్య విభేదాలు పెరుగుతూ వచ్చాయి..పరకాల ఉప ఎన్నికలలో క్షేత్రస్థాయిలో సమాచారం సేకరించి టీఆర్‌ఎస్‌కు మద్ధతు ప్రకటించడంతో కొండా సురేఖ లాంటి దిగ్గజంపై విజయం సాధించింది..అయినా టీఆర్‌ఎస్‌ చీఫ్‌ కోపం చల్లారలేదు..తెలంగాణ వస్తుందన్న సంకేతాలున్నాయన్న కేసీఆర్‌ తన మాటను కాదని జేఏసీ చైర్మన్‌ కోదండరాం ఉద్యమ కార్యాచరణను ఖరారు చేయడంతో ఇంకాస్త విభేదాలు పెరిగాయి..ఎట్టకేలకు తెలంగాణ మార్చ్‌లో పాల్గొన్న టీఆర్‌ఎస్‌ జేఏసీ విషయంపై ఇప్పటికీ మౌనంగానే ఉంది. నిజానికి తెలంగాణ సాధనే ధ్యేయంగా ఏర్పడ్డ పార్టీ టీఆర్‌ఎస్‌. మిగిలిన పార్టీలతో పోలిస్తే ఈ విషయంలో టీఆర్‌ఎస్‌కు ఏవీ సాటిరావు..అసెంబ్లీలో తెలంగాణ రాష్ట్ర బాణిని వినిపించడం, పదవులను త్యాగాలు చేయడంలో టీఆర్‌ఎస్‌ చూపిన తెగువ చారిత్రాత్మకం..అయితే అంతటితో సంతృప్తి చెందితే తెలంగాణ పోరాటంలో ఆపార్టీ వెనకబడి పోతుంది..జేఏసీలో ప్రధాన పార్టీ అయిన టీఆర్‌ఎస్‌ లేకుండా జేఏసీ కొనసాగడం ఉద్యమకారుల అనైక్యతను చాటుతుంది..ఉద్యమం ఒకటే అయినా పోరుబాటలో కొన్ని అభిప్రాయబేధాలుండడం సహజం..అవి ముదిరి విబేధాలుగా మారకముందే కూర్చొని చర్చించుకుంటే అవే సమసిపోతాయి..లేదంటే అవి శత్రువులకు అస్త్రంగా మారే అవకాశం ఉంది. ఇటీవల కేంద్ర మంత్రి వర్గ విస్తరణలో సైతం సీమాంధ్రకు చెందిన వారికే పెద్ద సంఖ్యలో మంత్రి పదవులను కేటాయించారు..దీంతో శతృ శిబిరం మరింత బలవంతమైంది..పార్టీలకతీతంగా సీమాంధ్ర పెట్టుబడిదారులు తెలంగాణ ఏర్పాటును అడ్డుకొంటున్నారు. జీవ వైవిధ్య సదస్సు నేపధ్యంలో ప్రధాని పర్యటన సందర్భంగా తెలంగాణ మీడియా ప్రతినిధులను కవరేజికి అనుమతించలేదు..తాజాగా ఆంధ్రప్రదేశ్‌ అవతరణ వేడుకల్లోనూ తెలంగాణ మీడియాకు పాసులిచ్చే విషయంలో వివక్షను ప్రదర్శించింది. కేసీఆర్‌ మౌనం వల్లే ఈ వివక్ష జరిగిందిజ 2009 నుంచి సైతం వచ్చిన తెలంగాణను అడ్డుకోవడంతో సీమాంధ్రులు లాబీయింగ్‌ చేస్తూ వచ్చారు. అయితే ప్రజా ఉద్యమాల ముందు పెట్టుబడిదారుల శక్తి, లాబీయింగ్‌లు పనిచేయవు..అయినా చిన్న పామునైనా పెద్ద కర్రతో కొట్టాలన్న సామెతను నిజం చేసుకోవాలి..ముందునుండి తెలంగాణ రాష్ట్ర సాధనే ధ్యేయంగా ఉమ్మడి లక్ష్యం కోసం ఉద్యమిస్తున్న ఉద్యోగ, విద్యార్థి, న్యాయవాద, రాజకీయ జేఏసీలు చురుకైన పాత్రలు పోషిస్తున్నాయి..2009 కృష్ణ కమిటీ రిపోర్టు ముందు వరంగల్‌ సభకు సైతం జేఏసీ ప్రతినిధులను ఆహ్వానించింది..ఐకమత్యమే మహాబలం అన్నట్లు అందరూ కలిసి పోరాడితేనే విజయం సాధించడం సాధ్యం..14 ఎఫ్‌, డిసెంబర్‌ 9 ప్రకటనలు సమిష్టి విజయాలే..ఒంటరిగా పోరాటం చేయాలనుకుంటే సీమాంధ్ర పెట్టుబడిదారులు మన అనైక్యతను అవకాశంగా తీసుకొనే ప్రమాదముంది..రెండు రోజుల పాటు జరిగే ఈ సమావేశాలలో కనీసం రెండోరోజైనా సాంఘీభావ సంఘాల ప్రతినిధులను ఆహ్వానిస్తుందని ఆశిద్దాం..టీఆర్‌ఎస్‌ మరోసారి మహోద్యామానికి తెరలేపడం ఆహ్వానించదగ్గ పరిమాణం..సెప్టెంబర్‌ మార్చ్‌తో తెలంగాణ రాష్ట్రంపై ప్రజల్లో ఉన్న ఆకాంక్ష మరోసారి రుజువైంది..తెలంగాణ అంశాన్ని రాజకీయాల కోసం వాడుకొనే పార్టీలను ఎండగడుతూ టీఆర్‌ఎస్‌ త్యాగాల పార్టీగానే ఉంటూ తెలంగాణ సాధనలో మరో మహత్తర పోరాటానికి పోరుశంఖం ఊదుతుందని ఆశిద్దాం..తెలంగాణ ఉద్యమంలో నాలుగుకోట్ల తెలంగాణ ప్రజలం భాగస్వామ్యులవుదాం..