ఉద్యోగులపై దాడులకు పాల్పడితే సహించం
అనంతపురం,ఫిబ్రవరి14(జనంసాక్షి): ఉద్యోగిపై చేయి చేసుకున్న నల్లమాడ మండల పరిషత్తు అధ్యక్షుడు(బ్రహ్మానందరెడ్డిని అరెస్టు చేసే వరకు ఆందోళన కొనసాగుతుందని పంచాయతీరాజ్ ఉద్యోగులు స్పష్టం చేశారు. నల్లమాడ మండల పరిషత్తు కార్యాలయంలో సీనియర్ సహాయకులు మల్లికార్జునరెడ్డిపై ఎంపీపీ బ్రహ్మానందరెడ్డి దాడి చేశాడు. దీనికి నిరసనగా పంచాయతీరాజ్ ఉద్యోగులు ఆందోళనకు దిగారు. అయితే జడ్పీ ఛైర్మన్ హావిూతో వీరు ఆందోళన విరమించినా ఉద్యోగికి న్యాయం చేసే వరకు ఆందోళన విరమించమని హెచ్చరించారు. ఉద్యోగులు ప్రభుత్వ పథకాలను ప్రజలకు అందజేయడంలో రేయింబవళ్లు పనిచేస్తున్నారని మినిస్టీరియల్ ఉద్యోగ సంఘం నాయకులు అన్నారు. అయితే కొందరు తమను అడ్డుకోవడం లేదా దాడులు చేయడం చేస్తూ చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. ఎక్కడైనా ఉద్యోగులు పనిచేయకపోయినా ఉన్నత అధికారులకు తెలియజేసే అధికారమే ప్రజాప్రతినిధులకు ఉంటుందన్నారు. ఉద్యోగులపై చేయి చేసుకొనే అధికారం రాజకీయ నాయకులకు లేదన్నారు. ఉద్యోగుల హక్కులు, గౌరవానికి భంగం వాటిల్లితే ఉద్యమాల బాట పడతామన్నారు. ఉద్యోగికి న్యాయం జరిగే వరకు దశల వారీగా ఆందోళనను కొనసాగిస్తామని హెచ్చరించారు.
అమిలినేనికి విముక్తి
ఇదిలావుంటే ప్రజారాజ్యం పార్టీ జిల్లా కార్యాలయంపై దాడి చేసి, ఫర్నిఛర్ను ధ్వంసం చేసిన కేసులో నేరారోపణ రుజువుకాకపోవడంతో ఆ కేసును కోర్టు కొట్టివేసింది. 9యేళ్ల సుదీర్ఘ విచారణ అనంతరం ఎలాంటి సాక్షాధారాలు లేకపోవడంతో నిందితులను నిర్దోషులుగా గుర్తిస్తూ మొదటితరగతి మేజిస్టేట్ర్ కోర్టు తీర్పునిచ్చింది. 2009 సాధారణ ఎన్నికల సమయంలో చిరు అభిమాన సంఘం నేత అమిలినేని సురేంద్రబాబుకు అనంతపురం ఎమ్మెల్యే టికెట్టు ఖరారు చేయలేదు. దీంతో ఆయన అనుచరులు పార్టీ కార్యాలయంపై దాడికి పాల్పడ్డారు. దీంతో పోలీసులు కేసు నమోదుచేశారు. అమిలినేని సురేంద్రబాబుతో పాటు మరో 30 మందిపై కేసు నమోదుచేశారు. నిందితులలో నార్పల సాంబశివుడు ఇప్పటికే మృతిచెందగా, మిగిలిన 29మందిపై విచారణ కొనసాగింది. ప్రజారాజ్యం పార్టీ నాయకులకు అమిలినేని సురేంద్రబాబు తదితరులకు విముక్తి లభించింది. అయితే ఆ తరవాత ప్రజారాజ్యంను కాంగ్రెస్లో విలీనం
చేశారు.