ఉద్యోగ నియామకాలు చేపడుతున్నాం
– శాసన మండలిలో ఆర్థికశాఖ మంత్రి ఈటల
హైదరాబాద్,నవంబర్1(జనంసాక్షి): రాష్ట్ర ప్రభుత్వం వివిధ శాఖల్లో ఉద్యోగ నియామకాలు చేపడుతుందని ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ స్పష్టం చేశారు. శాసనమండలిలో ప్రశ్నోత్తరాల సందర్భంగా ఉద్యోగ నియామకాలపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానం ఇచ్చారు. 93,739 ఖాళీలను భర్తీ చేయాలని ఆదేశించామని తెలిపారు. ఇప్పటి వరకు 63,025 ఉద్యోగాల భర్తీకి వివిధ నియామక సంస్థలకు అనుమతి ఇచ్చామని చెప్పారు. ఎన్ని అడ్డంకులున్నా ఉద్యోగ నియామకాలు చేపడుతున్నామని స్పష్టం చేశారు. గత ప్రభుత్వాలు ఉద్యోగుల చేత వెట్టిచాకిరీ చేయించుకున్నాయని గుర్తు చేశారు. 3 లక్షల మంది నిరుద్యోగ బిడ్డలకు ఉపాధి కల్పిస్తున్నామని తెలిపారు. తెలంగాణ యువతకు ఏదో రకమైన ఉపాధి కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పారు. ఉద్యోగ కల్పనకు అందరూ కృషి చేయాలన్నారు. సీఎం కేసీఆర్ ప్రభుత్వం ఉద్యోగుల సంక్షేమం కోసం కృషి చేస్తుందని మంత్రి ఉద్ఘాటించారు. అయితే ఉద్యోగాల భర్తీపై మంత్రి ఇచ్చిన సమాధానంపై కాంగ్రెస్ సభ్యులు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇందుకు నిరసనగా మండలి నుంచి వాకౌట్ చేశారు.



