ఎడ్‌సెట్ నిర్వహణపై నీలినీడలు?
హైదరాబాద్,ఫిబ్రవరి13(జనంసాక్షి): ఓ వైపు డిఎస్సీ కోసం నిరుద్యోగులు ఎదురు చూస్తున్న దశలో మరోవైపు ఇబ్బడిముబ్బడిగా కాలేజీలు ఉన్నాయని ప్రభుత్వం బావిస్తోంది. ప్రైవేట్ రంగంలో వేలాది మంది బిఇడి చేసిన వారు పనిచేస్తున్నారు. ప్రైవేట్ పాఠశాలలు ఎందరికో ఉపాధి కేంద్రాలుగా ఏర్పడ్డాయి. ప్రైవేట్ రంగంలోనూ బిఇడి, డిఇడి తప్పనిసరి చేయడంతో ఆయా యాజమాన్యలు కూడా వారికే ప్రాధాన్యం ఇస్తున్నాయి. ఈ సందర్భంలో బీఈడీ కోర్సుల్లో వచ్చే విద్యాసంవత్సరానికి నిర్వహించాల్సిన ఎడ్‌సెట్ ప్రవేశ పరీక్ష జరుగుతుందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుత విద్యా సంవత్సరానికి ఎడ్‌సెట్ రెండోదశ కౌన్సెలింగ్ నిర్వహణ ఇప్పటికీ కొలిక్కిరాలేదు. హైకోర్టు ఆదేశించినా ప్రభుత్వం కౌన్సెలింగ్ నిర్వహణపై నిర్ణయం తీసుకోలేదు. తాజాగా అన్ని ప్రవేశ పరీక్షలకూ కన్వీనర్లను నియమించినా ఎడ్‌సెట్‌కు నియమించలేదు. ఉపాధ్యాయ విద్య అభ్యర్థులు ఏటా 40 వేల మంది బయటకొస్తే ఉద్యోగాలివ్వడం ఎలా సాధ్యమని ఇటీవల ముఖ్యమంత్రి సైతం శాసనసభలో ప్రశ్నించారు. నిరుద్యోగులను తయారు చేసి వదులుతున్నారని అన్నారు. బీఈడీ, డీఈడీ కళాశాలలు కూడా అన్ని అవసరంలేదని ప్రభుత్వం భావిస్తోంది. ఈ అంశాలను పరిశీలిస్తే ఎడ్‌సెట్ నిర్వహిస్తారా అన్న సందేహం కలుగుతోంది. అధికారులు సైతం కచ్చితంగా జరుగుతుందని చెప్పలేకపోతున్నారు.