ఎనకకు మర్లి చూసే ముచ్చటే లేదు

‘సాగరహారం’ కొనసాగుతది
టీ జేఏసీ చైర్మన్‌ కోదండరాం
హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 26 (జనంసాక్షి) :
ఎట్టి పరిస్థితుల్లోనూ వెనక్కి తిరిగి చూడకుండా, తెలంగాణ కవాతు నిర్వహించే తీరుతామని, 30న సాగర హారాన్ని నిర్మించే తీరుతామని తెలంగాణ రాజకీయ ఐకాస ఛైర్మన్‌ ప్రొఫెసర్‌ కోదండరాం స్పష్టం చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడబలుక్కుని ఉద్యమాన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నాయన్నారు. తెలంగాణ నేతల అరెస్టులను ప్రభుత్వం వెంటనే ఆపాలని ఆయన డిమాండ్‌ చేశారు. సాగరహారం పేరిట జరుప తలపెట్టిన తెలంగాణా మార్చ్‌కు అనుమతించాలని కోరుతూ కోదండరాం ఆధ్వర్యంలో పలువురు నేతలు డీజీపీని కలిశారు. అయితే ఈ నెల 30న అనుమతి ఇవ్వటం కుదరదని డీజీపీ చెప్పారని ఐకాస కన్వీనర్‌ స్వామిగౌడ్‌ తెలిపారు. వినాయక నిమజ్జనానికి ఎలాంటి ఆటంకం కలిగించమని, ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలిగించమన్నారు. నిమజ్జనం త్వరగా పూర్తి చేయాలని ఇప్పటికే కమిషనర్‌ అనురాగశర్మ సూచించారు. ఈ నేపథ్యంలో మార్చ్‌కు అనుమతి కుదరదని అన్నారు. అయితే ఎట్టి పరిస్తితుల్లోనూ మార్చ్‌ జరుపుతామని కోదండరామ్‌ అన్నారు. తెలంగాణ ఉద్యమంలో భాగంగా దీన్ని చేపట్టామని, ఎట్టి పరిస్తితుల్లోనూ వాయిదా కుదరదన్నారు. తెలంగాణ మార్చ్‌ వాల్‌పోస్టర్‌ను ఆయన విడుదల చేశారు. శాంతియుతంగా మార్చ్‌ జరపాలనుకున్నా ప్రభుత్వం అణచివేత ధోనణిలో ఉందన్నారు. కేంద్రప్రభుత్వం, సీమాంధ్ర నేతలు వ్యతిరేక కుట్రలు పన్నుతున్నారని అన్నారు. దీన్ని ఇక సహించబోమన్నారు.