ఎరువులు అధిక ధరలకు విక్రయిస్తే చర్యలుడీలర్లను ఆదేశించిన కలెక్టర్‌

శ్రీకాకుళం, జూలై 5: జిల్లాలో ఎరువులను ప్రభుత్వ ధరల కంటే అధికంగా విక్రయిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్‌ సౌరబ్‌గౌర్‌ హెచ్చరించారు. కలెక్టర్‌ కార్యాలయ సమావేశమందిరంలో వ్యవసాయ అధికారులు, ఎరువుల డీలర్లతో ఆయన సమీక్షించారు. ఎరువులు ఎంఆర్‌పికి విక్రయించలేమని పలువురు డీలర్లు కలెక్టర్‌ తెలియజేయగా అలా కుదరదంటూ కలెక్టర్‌ పేర్కొన్నారు. ఎంఆర్‌పి ధరలకు విక్రయించవలసిందేనని, రైతులను మోసం చేయడానికి వీలులేదని తెలిపారు. నాగార్జున ఫర్టిలైజర్స్‌ కంపెనీ యూరియాను సకాలంలో సరఫరా చేయడం లేదని డీలర్లు ఫిర్యాదు చేయడంతో కలెక్టర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లాలో 9వేల మెట్రిక్‌ టన్నుల యూరియా ఉండగా డీలర్లకు ఎందుకు సరఫరా చేయడం లేదంటూ వారిపై మండిపడ్డారు. నాలుగు రోజులుగా వ్యవసాయ అధికారుల ద్వారా సంబంధిత డీలర్లకు యూరియా చేరాలని కలెక్టర్‌ ఆదేశించారు. సీజన్‌లో రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాలని కలెక్టర్‌ పేర్కొన్నారు. జిల్లాకు ఎరువులు ఏ మేరకు అవసరం ఉంది. ఎంతవరకు వస్తున్నాయన్న దానిపై సమగ్ర నివేదికను తనకు అందజేయాలని ఆయా కంపెనీల యజమాన్యాల నుంచి తనకు ఇమేల్‌ ద్వారా జిల్లాకు వస్తున్న ఎరువుల సమాచారాన్ని తెలియజేయాలని కలెక్టర్‌ ఆదేశించారు. ఎరువుల కంపెనీలకు ఎక్కడైన ఇబ్బందులు ఉండే తన దృష్టికి తీసుకురావాలన్నారు. ఈ నెల 15 వేల మెట్రిక్‌ టన్నుల యూరియా అవసరమని, వచ్చే నెలలో 35 వేల టన్నుల వరకు యూరియా అవసరం ఉంటుందని డీలర్లు, వ్యవసాయ అధికారులు కలెక్టర్‌కు తెలిపారు. వ్యవసాయ అధికారులు సమస్యలను సానుకూలంగా పరిష్కరించుకుంటూ పని చేయాలే తప్ప ఒత్తిళ్లకు లోనుకాకూడదన్నారు. ప్రణాళికబద్ధంగా పని చేస్తే ఎలాంటి ఇబ్బంది ఉండదని కలెక్టర్‌ పేర్కొన్నారు. వ్యవసాయ శాఖ సంచాలకులు ఎస్‌. మురళీకృష్ణ మాట్లాడుతూ జిల్లాలో 75 శాతం విత్తనాలు వేశారని, 70 నుంచి 80 వేల మెట్రిక్‌ టన్నుల ఎరువు అవసరం ఉంటుందన్నారు. ఈ సమావేశంలో డిసిసిబి ముఖ్య కార్యనిర్వహణాధికారి కె.జనార్దన తదితరులు పాల్గొన్నారు.