ఎర్రకోటపై రైతుల జెండా
ర్యాలీ లో అసాంఘిక శక్తులు
అందుకే హింసాత్మకమైంది
విచారం వ్యక్తం చేసిన రైతు సంఘాలు’
ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
న్యూఢిల్లీ,జనవరి26 (జనంసాక్షి): కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు నిర్వహించ తలపెట్టిన ట్రాక్టర్ ర్యాలీలో ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో వందలాది ట్రాక్టర్లతో వేలాది మంది అన్నదాతలు నిరసనలు తెలిపారు. అయితే ట్రికీ బార్డర్లో రైతులు బ్యారికేడ్లు తోసేయడంతో ర్యాలీ ఉద్రిక్తంగా మారింది. మంగళవారం రైతులు చేపట్టిన ట్రాక్టర్ల ర్యాలీలో ఓ రైతు మరణించాడు. సెంట్రల్ ఢిల్లీలోని మింటో రోడ్ సవిూపంలో ట్రాక్టర్ బోల్తా పడడంతో అదే ట్రాక్టర్ కింద పడి రైతు మరణించాడు. మరణించిన రైతుపై జాతీయ జెండా కప్పి ఐటీఓ ఇంటర్ సెక్షన్ వద్ద రైతులు నిరసనకు దిగారు. సదరు రైతు మరణానికి కారణం పోలీసు కాల్పులు జరపడమేనని నిరసన చేస్తున్న రైతులు ఆరోపిస్తున్నారు. అయితే నిబందనలు ఉల్లంఘించి రైతులు ఢిల్లీలోకి ప్రవేశించే క్రమలో పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించారు. వారిని అదుపు చేసేందుకు చేసిన ప్రయత్నాలు విఫలం కావడంతో ఈ చర్య తీసుకున్నారు. ట్రాక్టర్‌ను మలుపు తీసుకునే సమయంలో పోలీసులు కాల్పులు జరిపారని, ఆ ప్రమాదంలో రైతు మరణించాడని వారు ఆరోపించారు. మరో పక్క, రైతులు చేపట్టిన ట్రాక్టర్ ర్యాలీ ఎట్టేకేలకు ఎర్రకోటకు చేరుకుంది. మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో రైతులు ఎర్రకోటను ముట్టడించారు. ఎర్రకోట బురుజుల పైకి చేరి ప్లాగ్ పోల్‌పై జెండాలు ఎగరేశారు. రిపబ్లిక్ డే పరేడ్ కంటే ముందే ఉదయం ట్రాక్టర్ ర్యాలీ చేపట్టిన రైతులు పెద్ద సంఖ్యలో ఢిల్లీలోకి వివిధ ప్రాంతాల నుంచి అడుగుపెట్టారు. వారిని నిరోధించేందుకు పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేయడంతో రైతులు బారికేడ్లు దాటే ప్రయత్నం చేశారు. వారిని నిరోధించే క్రమంలో భాష్ప వాయిగోళాలు, లాఠీలకు పోలీసులు పని చెప్పారు. సంజయ్ గాంధీ ట్రాన్స్పోర్ట్ నగర్లో కూడా పరిస్థితి ఆందోళనకరంగా తయారైంది. సంజయ్ గాంధీ ఏరియా స్మోక్ ఛాంబర్లా కనిపిస్తోంది. రైతులను అడ్డుకోవడానికి పోలీసులు లాఠీచార్జ్ చేయడంతోపాటు టియర్ గ్యాస్‌ను కూడా ప్రయోగించారు. మధ్యాహ్నం 12 గంటలకు ట్రాక్టర్ ర్యాలీ ప్రారంభమవుతుందని భావించినా.. ఉదయం 8 గంటలకే వేలాది మంది అన్నదాతలు బార్డర్స్ వద్ద గుమిగూడి నిరసనలు తెలపుతూ పరేడ్ నిర్వహించారు. ఢిల్లీతోపాటు రాజస్థాన్, హర్యానాల్లోనూ రైతులు ట్రాక్టర్ ర్యాలీలు తీసారు. అయితే ట్రాక్టర్ల ర్యాలీ సందర్భంగా పోలీసులు విధించిన నిబంధనలను రైతులు ఉల్లంఘిం చారు. సరిహద్దులు దాటి దేశ రాజధాని ఢిల్లీలోకి రైతులు ప్రవేశించారు. మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేసేంత వరకు వెనక్కి వెళ్లేది లేదని రైతుల డిమాండ్ చేస్తున్నారు. అయితే రైతులు నిబంధనలు ఉల్లంఘించి, చట్టాలను చేతుల్లోకి తీసుకోకుండా సంయమనం, శాంతి పాటించాలని, పోలీసులపై దాడి, విధ్వంసం సృష్టించవద్దని ఢిల్లీ పోలీసులు విజ్ఞప్తి చేశారు. అయినా పరిస్థితి అదుపుతప్పడంతో ఢిల్లీలోని ముకర్బా చౌక్ వద్ద రైతులపై పోలీసులు బాష్పవాయువును ప్రయోగించారు. రైతులు బారికేడ్లను ధ్వంసం చేయడానికి ప్రయత్నించడంతో పాటు ట్రాక్టర్లతో సిమెంటు దిమ్మలను తొలగించే ప్రయత్నం చేశారు. రైతులు ట్రాక్టర్లతో ఢిల్లీలోని ఎర్రకోట వద్దకు చేరుకుని నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని ఆందోళన చేపట్టారు. పెద్ద ఎత్తున రైతుల ట్రాక్టర్లు దేశ రాజధానిలో పరుగులు తీస్తుండటంతో ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ మంగళవారం కొన్ని మెట్రో స్టేషన్లను మూసివేసింది. ముఖ్యంగా సెంట్రల్ ఢిల్లీ, ఉత్తర ఢిల్లీలలోని మెట్రో స్టేషన్లను మూసివేసింది. ఈ వివరాలను డీఎంఆర్సీ ట్విటర్ ద్వారా తెలిపింది. ఢిల్లీలోని అనేక ప్రాంతాల్లో ఘర్షణల నేపథ్యంలో గ్రీన్ లైన్, యెల్లో లైన్లలోని కొన్ని స్టేషన్ల ప్రవేశ, బయటకు వెళ్లే మార్గాలను మూసివేసినట్లు డీఎంఆర్సీ తెలిపింది. ఐటీఓ, ఇందప్రస్థ, లాల్ కిలా స్టేషన్లను మూసివేసినట్లు తెలిపింది. మరొక ట్వీట్లో బ్రిగేడియర్ ¬షియార్ సింగ్, బహదూర్ గఢ్ సిటీ, పండిట్ శ్రీరామ్ శర్మ, టిక్రి బోర్డర్, టిక్రి కలాన్, ఘేవ్రా, ముండ్క ఇండస్టియ్రల్ ఏరియా, ముండ్క, రాజధాని పార్క్, నంగ్లోయ్ రైల్వే స్టేషన్, నంగ్లోయ్ మెట్రో స్టేషన్లను మూసివేసినట్లు పేర్కొంది. మరొక ట్వీట్లో, సమయ్‌పూర్ బడ్లీ, రోహిణి సెక్టర్ 18/19, హైదర్‌పూర్ బడ్లి మోర్, జహంగీర్ పురి, ఆదర్శ్ నగర్, ఆజాద్‌పూర్, మోడల్ టౌన్, జీటీబీ నగర్, విశ్వవిద్యాలయం, విధాన సభ, సివిల్ లైన్స్ మెట్రో స్టేషన్లను మూసివేస్తున్నట్లు పేర్కొంది. కేంద్రం తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాలను రద్దుచేయాలని డిమాండ్ చేస్తూ రైతులు చేపట్టిన గణతంత్ర పరేడ్ తీవ్ర ఉద్రిక్తతలకు వేదికగా మారింది. పోలీసులు అనుమతించిన రూట్ మ్యాప్‌ను పక్కనపెట్టి రైతులు ఎర్రకోట వైపు దూసుకెళ్లడం కలకలం రేపింది. ఎర్రకోట బురుజులపైకి ఎక్కిన రైతులు అక్కడే జెండాలతో నినాదాలు చేశారు. తీవ్ర ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో దిల్లీలోని పలు ప్రాంతాల్లో కేంద్రం ఇంటర్నెట్ సేవలను నిలిపివేసింది. రాత్రి 12గంటల వరకు టెలికాం, ఇంటర్నెట్ సేవలు నిలుపుదల చేస్తున్న్టట్టు వెల్లడించింది. శాంతిభద్రతల దృష్ట్యా సింఘు, టిక్రీ, ఘాజీపూర్, ముఖుర్దాచౌక్, నగ్లోయ్ ప్రాంతాల్లో ఇంటర్నెట్ సేవలను నిలిపివేస్తున్నట్టు కేంద్రం తెలిపింది.
మెట్రో స్టేషన్ల గేట్లు మూసివేత
మరోవైపు, గణతంత్ర పరేడ్‌తో మెట్రో సేవలకు అంతరాయం ఏర్పడింది. దేశ రాజధాని నగరంలో ఉద్రిక్తతల నేపథ్యంలో దిల్లీ మెట్రో అధికారులు అప్రమత్తమయ్యారు. తొలుత ఐటీవో మెట్రో స్టేషన్ ప్రవేశ, నిష్క్రమణ గేట్లు మాత్రమే మూసివేసిన అధికారులు.. ఆ తర్వాత జామా మసీద్, దిల్షద్ గార్డెన్, జిల్మిల్, మానసరోవర్ పార్కు, ఇంద్రప్రస్థ తదితర స్టేషన్లను మూసివేశారు.