ఏరోస్పేస్, డిఫెన్స్ రంగాల్లో దూసుకెళ్తున్న‌ తెలంగాణ: మంత్రి కేటీఆర్‌

న్యూయార్క్‌: అమెరికాలోని వాషింగ్ట‌న్ డీసీలో జ‌రిగిన ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ రౌండ్‌టుబుల్ మీటింగ్‌లో మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. ఆ స‌మావేశంలో ఆయ‌న మాట్లాడుతూ.. ఏరోస్పేస్ రంగంలో తెలంగాణ అసాధార‌ణ ప్ర‌తిభ‌ను క‌న‌బ‌రిచింద‌ని, వ‌రుస‌గా మూడు ఏళ్లు అవార్డుల‌ను గెలుచుకున్న‌ట్లు తెలిపారు. 2018, 2020, 2022 సంవ‌త్స‌రాల్లో ఏరోస్పేస్ క్యాట‌గిరీలో తెలంగాణ‌కు బెస్ట్ స్టేట్ అవార్డులు వ‌చ్చిన‌ట్లు మంత్రి కేటీఆర్ వెల్ల‌డించారు. ఏరోస్పేస్ సిటీ ఆఫ్ ఫ్యూచ‌ర్ కేట‌గిరీలో హైద‌రాబాద్‌కు నెంబ‌ర్ వ‌న్ ర్యాంకు వ‌చ్చిన‌ట్లు ఆయ‌న తెలిపారు. తెలంగాణ‌కు వ‌స్తున్న అవార్డులు .. రాష్ట్రానికి గుర్తింపును ఇస్తున్నాయ‌ని, ఏరోస్పేస్ రంగంలో రాష్ట్రం దూసుకువెళ్తున్న‌ట్లు ఆయ‌న చెప్పారు.