ఏసీ బస్సుల్లో వైఫై ఫ్రీ….
హైదరాబాద్: ప్రయాణికులను ఆకట్టుకునేందుకు తెలంగాణ ఆర్టీసీ వినూత్న పథకం చేపట్టింది. సిటీ బస్సుల్లో ఉచిత వైఫై సదుపాయం కల్పించాలని నిర్ణయించింది. ఏసీ, మెట్రో డీలక్స్ బస్సుల్లో ఈ సదుపాయం కల్పించనున్నట్లు ఆర్టీసీ ఈడీ పురుషోత్తం తెలిపారు. ప్రయాణికులకు తొలి 30 నిమిషాలు ఈ సదుపాయాన్ని ఉచితంగా అందించనున్నారు.
జేఎన్‌ఎన్‌యూఆర్‌ఎం బస్సుల బాడీల మార్పు దశల వారీగా చేపట్టనున్నట్లు ఈడీ తెలిపారు. ఈ ఏడాది 300 బస్సులు, వచ్చే ఏడాది 350 బస్సుల బాడీలను మార్చనున్నట్లు తెలిపారు. 2015-16లో గ్రేటర్ హైదరాబాద్ జోన్‌లో ఆర్టీసీకి రూ.289 కోట్ల నష్టం వచ్చినట్లు తెలిపారు. ప్రయాణికులకు ఆకట్టుకుని నష్టాల వూబి నుంచి గట్టెక్కేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.
మొదటి 30 నిమిషాలు ఉచితంగా ఉంటుంది. ఆ తరువాత చార్జీ చేస్తారు. ఈ మేరకు ‘గో రూరల్ ఇండియా’ అనే సంస్థతో ఆర్టీసీ తాజాగా ఒప్పందం ఏర్పాటు చేసుకుంది. ప్రస్తుతానికి మాత్రం ఏసీ బస్సుల్లోనే వైఫై సేవలు అందుబాటులోకి వస్తాయి. మహా త్మాగాంధీ, జూబ్లీబస్‌స్టేషన్‌లలో ఇప్పటికే వైఫై సేవలను ఏర్పాటు చేసిన ఆర్టీసీ అదే తరహాలో ప్రయాణికులను ఆకట్టుకొనే చర్యల్లో భాగంగా ఏసీ బస్సులకు సైతం విస్తరిం చేందుకు సన్నాహాలు చేపట్టింది. నగరంలోని వివిధ మార్గాల నుంచి శంషాబాద్ విమానాశ్రయానికి నడుస్తున్న పుష్పక్ బస్సుల్లోనూ, మెట్రో లగ్జరీ ఏసీ బస్సుల్లోనూ ప్రయాణికుల ఆదరణ తక్కువగా ఉన్న దృష్ట్యా ప్రయాణికులను పెంచుకొనేందుకు గ్రేటర్ ఆర్టీసీ ఈ సరికొత్త పథకానికి శ్రీకారం చుట్టింది.
పుష్పక్ బస్సుల్లో వెహికల్ ట్రాకింగ్…
వైఫై సదుపాయంతో పాటు పుష్పక్ బస్సులన్నింటిలో ‘వెహికల్ ట్రాకింగ్, ప్యాసింజర్ ఇన్ఫర్మేషన్ వ్యవస్థ’ ను అమ లు చేస్తారు. దీంతో పుష్పక్ బస్సుల కోసం ఎదురు చూసే ప్రయాణికులకు ముందస్తుగానే సమాచారం లభిస్తుంది. బస్టాపుల్లో ఏర్పాటు చేసిన డిస్‌ప్లేబోర్డులపై ఏ బస్సు ఎక్కడ ఉందనే సమాచారం ప్రద ర్శిస్తారు. అలాగే బస్సుల్లోనూ రాబోయే స్టేషన్ల ప్రదర్శనతో పాటు, అనౌన్స్‌మెంట్ కూడా ఉంటుంది.ప్రస్తుతం నగరంలోని 1200 మెట్రో డీలక్స్, ఏసీ బస్సుల్లో ఈ వెహికల్ ట్రాకింగ్, ప్యాసింజర్ ఇన్ఫర్మేషన్ వ్యవస్థ అమలవుతుంది.
జాతీయ,అంతర్జాతీయ స్థాయి ప్రయాణికులను ఆకట్టుకోవడంతో పాటు, ఆదరణ పెంచుకొనే చర్యల్లో భాగంగా పుష్పక్ బస్సులన్నింటికీ ఈ వ్యవస్థను విస్తరించనున్నారు. అలాగే రూ.2.20 కోట్ల వ్య యంతో పుష్పక్ బస్సుల్లో సమూలమైన మార్పులు చేయనున్నట్లు ఈడీ తెలిపారు. బస్సు బాడీలను కొత్తగా ఏర్పాటు చేస్తారు. కలర్‌కోడ్ కూడా మారుతుంది. జూబ్లీబస్‌స్టేషన్, బీహెచ్‌ఈఎల్, జేఎన్‌టీయూ నుంచి 29 బస్సులు ప్రతిరోజు ఉదయం 3.30 గంటల నుంచి రాత్రి ఒంటిగంట వరకు రాకపోకలు సాగిస్తున్నాయి.
ప్రయాణికులకు చేరువయ్యేందుకు….
* వెహికల్ ట్రాకింగ్,ప్యాసింజర్ ఇన్ఫర్మేషన్ వ్యవస్థలో భాగంగా ‘హైదరాబాద్ మెట్రో బస్’ మొబైల్ యాప్ ద్వారా
* ఏ బస్సు ఎక్కడ ఉందో తెలుసుకొనే సదుపాయాన్ని ప్రవేశపెట్టనున్నారు.
* హైదరాబాద్-బెంగళూర్ రూట్‌లో ‘ఫైండ్ టీఎస్‌ఆర్‌టీసీ’ పేరుతో ఈ యాప్ అందుబాటులోకి రానుంది.
* 2010-2015 మధ్య కాలంలో జెఎన్‌ఎన్‌యూఆర్‌ఎం పథకంలో భాగంగా కొనుగోలు చేసిన 650 బస్సులను సమూలంగా మార్చేందుకు చర్యలు చేపట్టారు. ఈ ఏడాది 300 బస్సులు, వచ్చే ఏడాది 350 బస్సుల్లో ఇంజన్, చాసీస్ మినహాయించి బస్సు బాడీలను, సీట్లను, అన్నింటిని కొత్తగా ఏర్పాటు చేస్తారు. ఇప్పటి వరకు 20 బస్సులను ఈ తరహాలో అభివృద్ధి చేశారు.
* త్వరలో ప్రారంభం కానున్న మియాపూర్-ఎస్సార్‌నగర్ మెట్రో రైలుకు అనుసంధానంగా జీడిమెట్ల-గచ్చిబౌలి రూట్‌లో 4 కొత్త బస్సులను ప్రవేశపెట్టనున్నారు. ప్రతి అరగంటకు ఒక బస్సు అందుబాటులో ఉంటుంది.
* మెట్రో పనుల కారణంగా నిలిపివేసిన వనస్థలిపురం-కేపీహెచ్‌బీ (186) రూట్ బస్సును త్వరలో ప్రారంభిస్తారు. ఈ మార్గంలో ప్రతి 25 నిమిషాలకు ఒకటి చొప్పున 8 బస్సులు రాకపోకలు సాగిస్తాయి.