ఒక్కో విద్యార్థిపై 41వేల ఖర్చు పెడుతున్నాం

– అసెంబ్లీలో మంత్రి కడియం శ్రీహరి
హైదరాబాద్‌, నవంబర్‌7(జ‌నంసాక్షి) : శాసనసభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా డిప్యూటీ సీఎం, విద్యాశాఖ
మంత్రి కడియం శ్రీహరి మాట్లాడుతూ.. 2016-17 విద్యాసంవత్సరానికి గానూ.. ప్రభుత్వ, లోకల్‌ బాడీ, కేజీబీవీ, మోడల్‌, రెసిడెన్షియల్‌ స్కూల్స్‌లో విద్యార్థులకు విద్యను అందించడానికి రూ. 10,130 కోట్లు ఖర్చు చేయడం జరిగిందన్నారు. ఒక్కొక్క విద్యార్థిపై రూ. 41,196 ఖర్చు చేస్తున్నామని తెలిపారు. ఉపాధ్యాయుల జీతాలు, సిబ్బంది వేతనాలు, పాఠశాలలో వసతుల కల్పన, టాయిలెట్స్‌ మెయింటనెన్స్‌, అదనపు తరగతి గదుల కోసం నిధులు ఖర్చు చేయడం జరిగిందన్నారు. రాష్ట్రంలోని పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం కోసం రూ. 469 కోట్లు ఖర్చు చేయడం జరిగిందన్నారు. రాష్ట్రంలో 470 కేజీబీవీల అభివృద్ధికి రూ. 167 కోట్ల నుంచి రూ. 175 కోట్లు ఖర్చు చేశామన్నారు. ప్రభుత్వ పాఠశాలల మెయింటనెన్స్‌ కోసం రూ. 100 కోట్లు ఇచ్చామని గుర్తు చేశారు కడియం. మోడల్‌ స్కూల్స్‌ కోసం రూ. 190 కోట్లు ఖర్చు చేసినట్లు తెలిపారు. ఏడాదికి ఏడాది విద్యపై పెట్టే ఖర్చు పెరుగుతుందన్నారు. ప్రభుత్వ పాఠశాలలను కాపాడుకుంటూనే.. ఎన్‌రోల్‌మెంట్‌ పెంచుకుంటున్నామని తెలిపారు. ఉపాధ్యాయుల రేషనలైజేషన్‌కు చర్యలు తీసుకుంటున్నామని విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి స్పష్టం చేశారు.

తాజావార్తలు