ఓటు వేసేందుకు అనుమతినీయండి : జగన్‌

హైదరాబాద్‌, జూలై 10 : రాష్ట్రపతి ఎన్నికల్లో హైదరాబాద్‌లోనే ఓటు వేసేందుకు తనకు అనుమతి ఇవ్వాలంటూ కడప ఎంపి వైఎస్‌ జగన్‌ కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాశారు. తన న్యాయవాది ద్వారా ఆ లేఖను ఆయన మంగళవారంనాడు ఎన్నికల సంఘానికి అందజేశారు. ఆస్తుల కేసులో అరెస్టయి ఆయన ప్రస్తుతం చంచల్‌గూడ జైలులో రిమాండులో ఉన్న విషయం తెలిసిందే. రాష్ట్రపతి ఎన్నిక విషయంలో ఓటు హక్కు వినియోగించుకోవడం తన ప్రాధమిక హక్కు అని, తాను జైలులో ఉన్నందున ఢిల్లీకి వెళ్లి ఓటు వేసే అవకాశం లేదని, హైదరాబాద్‌లోనే ఓటు వేసే అవకాశాన్ని కల్పించాలని కోరారు. ఇదే విషయాన్ని బెయిల్‌ కోసం దాఖలు చేసుకున్న పిటిషన్‌లో సుప్రీంకోర్టును కూడా కోరారు. జైలులో ఉన్న ప్రజా ప్రతినిధి ఓటు హక్కు వినియోగించుకోవాలంటే ఎన్నికల కమిషన్‌ నుంచి అనుమతి పొందాలి. పార్లమెంటు సభ్యులు అసెంబ్లీలో ఓటు హక్కును వినియోగించుకునే అవకాశం ఉంటుంది. రాష్ట్రపతి ఎన్నికల విషయంలో యుపిఎ అభ్యర్ధి ప్రణబ్‌ముఖర్జీ, బిజెపి బలపర్చిన పిఎ సంగ్మాలో ఎవరికి మద్దతు ఇవ్వాలనే విషయంలపై వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఇంకా నిర్ణయించని విషయం తెలిసిందే. వైఎస్‌ఆర్‌సిపికి 17మంది ఎమ్మెల్యేలు, జగన్‌తో పాటు ఇద్దరు ఎంపీలు ఉన్నారు.