ఔటర్ రింగ్ రోడ్డు అవతలకు పరిశ్రమలు

small-inds-meet-ktr

కాలుష్యపూరిత పరిశ్రమలను హైదరాబాద్ అవుటర్ రింగ్ రోడ్డు అవతలకు తరలించే అంశాన్ని మంత్రి కె.టి.రామారావు సమీక్షించారు. మొత్తం 1068 కాలుష్యపూరిత పరిశ్రమలను మొదటి దశలో నగరం అవతలకు తరలించేందుకు తీసుకోవాల్సిన చర్యలను మంత్రి చర్చించారు. నగరంలోని పౌరుల జీవితాల్లో క్వాలిటీ పెంచేందుకే ఈ ప్రయత్నమని మంత్రి తెలిపారు. మొదట కాలుష్యపూరిత కంపెనీలను తరలిస్తామని, తర్వాతి దశల్లో అన్ని పరిశ్రమలను నగరం నుంచి బయటకు తరలిస్తామన్నారు. నగరంలోని కాలుష్యాన్ని తగ్గించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమం ఉంటుందన్నారు.

2017 డిసెంబర్ నాటికి అన్ని పరిశ్రమలను అవుటర్ రింగ్ రోడ్డు అవతలకు తరలించడం ప్రాథమిక లక్ష్యంగా నిర్ణయించుకున్నట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు. పరిశ్రమల తరలింపు పెద్ద సవాలన్నా మంత్రి, ఇందుకోసం పరిశ్రమలకు ప్రోత్సాహకాలు ఇవ్వడంతోపాటు, నూతనంగా పరిశ్రమలను ఏర్పాటు చేసే ప్రాంతాల్లోని ప్రజల్లో అవగాహన, నమ్మకం కలించడం కోసం పనిచేస్తామన్నారు. నూతన ప్రాంతాల్లో జనావాసాలకు సాధ్యమైనంత ఎక్కువ దూరంగా ఈ పరిశ్రమలను ఏర్పాటు చేసేలా చూస్తామని, దీంతో ఆయా జనావాసాలకు ఎలాంటి ఇబ్బంది ఉందన్నారు.

నూతనంగా ఏర్పాటు చేసే పరిశ్రమల్లో జీరో లిక్విడ్ డిశ్చార్జ్ వంటి విధానాలతో జల, వాయు కాలుష్యాన్ని పూర్తిగా తగ్గించవచ్చన్నారు మంత్రి కేటీఆర్. ఈ తరలింపుతో పరిశ్రమలు సైతం అధునాతన పరిజ్ఞానాన్ని అందుకునేందుకు, అత్యుత్తమ మౌళిక వసతులు, సదుపాయాల కల్పనకు అవకాశం వస్తుందన్నారు. ఈ తరలింపులో పరిశ్రమలకు పలు రకాల ప్రోత్సాహకాల మీద మంత్రి అధికారులతో చర్చించారు. ల్యాండ్ కన్వర్షన్, పన్ను రాయితీలు, పరిశ్రమ ఆవరణల్లోనే గృహవసరాలకు అనుమతి వంటి ప్రోత్సాహకాలు ఇచ్చేందుకు సూత్రప్రాయంగా ఈ సమావేశంలో నిర్ణయించారు.

ఈ పరిశ్రమలు ఒకచోట ఏర్పాటు చేసేందుకు వాటిని వర్గీకరణ చేస్తామన్నారు మంత్రి కేటీఆర్. ఒకే రంగంలో ఉన్న కంపెనీలకు ఒకే క్లస్టర్లలో పరిశ్రమలు ఏర్పాటు చేసుకునేందుకు అవకాశం కల్పిస్తామన్నారు. ఇప్పటికే ప్రభుత్వానికి ఉన్న భూముల్లో ఈ క్లస్టర్లను ఏర్పాటు చేసేందుకు ప్రయత్నాలు చేస్తామన్నారు. ఈ క్లస్టర్ల ఏర్పాటులో హెచ్ఎండీఎ లాంటి సంస్ధలతో కలిసి పనిచేయాలని టియస్ ఐఐసి అధికారులను మంత్రి ఆదేశించారు. త్వరలోనే నగరంలోని పరిశ్రమల యాజమాన్యాలతో సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి తెలిపారు.

ఈ అంశంలో బల్క్ డ్రగ్ మాన్యుఫ్యాక్చరర్స్ అసోషియేషన్ సభ్యులతో మంత్రి కేటీఆర్ సమావేశం అయ్యారు. పరిశ్రమలను తరలించేందుకు ఏ ఏ కార్యక్రమాలు చేయాలో తెలపాల్సిందిగా కోరారు. నగరంలోని కెమికల్, ఫార్మా కంపెనీలను నూతనంగా ఏర్పాటు చేయబోయే ఫార్మా సిటీలోకి తరలించేందుకు ఉన్న అవకాశాలను పరిశీలిస్తామన్నారు. మిగిలిన కంపెనీలకు ప్రత్యేకంగా క్లస్టర్లుగా ఏర్పాటు చేసి అక్కడికి తరలిస్తామన్నారు. కంపెనీల తరలింపులో పరిశ్రమలతో కలిసి సమన్వయంతో పనిచేస్తామని, వారి ఉత్పత్తికి ఇబ్బంది లేకుండా చూస్తామన్నారు. కామన్ అప్లూయెంట్ ప్లాంట్ల నిర్మాణం వంటివి ఏర్పాటు చేసిన తర్వాతనే తరలింపు మొదలు పెడతామని మంత్రి కేటీఆర్ భరోసా ఇచ్చారు.