కరెంటు కష్టాలు తీర్చిన ఘనత సీఎం కేసీఆర్‌దే

మంథని, (జనంసాక్షి) :
ఆలోచన చేయకుండా కాంగ్రెస్‌కు ఓటేస్తే ఐదేండ్లు లెక్కలేసి కరెంటు ఇస్తరని బీఆర్‌ఎస పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పుట్ట మధూకర్‌ అన్నారు.
అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో బాగంగా మంగళవారం మంథని మండలం లక్కేపూర్‌లో ఇంటింటా ప్రచారం నిర్వహించారు. ఈసందర్బంగా ఆయన మాట్లాడుతూ రైతు సంక్షేమమే లక్ష్యంగా ముందుకు సాగే ముఖ్యమంత్రి కేసీఆర్‌ వ్యవసాయానికి 24గంటల కరెంటు ఇస్తుంటే కాంగ్రెస్సోళ్లు మాత్రం మూడు గంటల కరెంటు ఇస్తామని ప్రకటిస్తున్నారని, 10హెచ్‌పీ మోటారు పెట్టుకుంటే గంటలో ఎకరం నీళ్లు పారుతాయని లెక్కలు వేస్తున్నారని ఆయన తెలిపారు. 24గంటల కరెంటు కావాలో మూడు గంటల కరెంటు కావాలో రైతులు ఆలోచన చేయాలన్నారు. ఆనాడు రైతుల కరెంటు కష్టలు చూసిన సీఎం కేసీఆర్‌ గొప్పగా ఆలోచన చేసి వ్యవసాయం పండుగలా జరుపుకోవాలని 24గంటల కరెంటు, సాగునీరు, ఎరువులతో పాటు పెట్టబడి సాయం అందిస్తున్నారని ఆయన వివరించారు. కాంగ్రెస్‌ అధికారంలో ఉన్న సమయంలో ఎరువుల కోసం చెప్పులు లైన్‌లో పెట్టడం, కరెంటు కోసం సబ్‌స్టేషన్‌ల వద్ద ధర్నాలు చేసిన సంఘటనలు మర్చిపోవద్దన్నారు. కాంగ్రెస్‌కు ఓటేస్తే మళ్లీ అవే పరిస్థితులు వస్తాయన్నారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన పదేండ్ల పాలన, పదేండ్ల ముందు కాంగ్రెస్‌ పాలనపై బేరీజు వేసుకోవాలని, తాను, కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి పనితీరును గమనించాలని అన్నారు. ఎన్నికలు వచ్చాయంటే నాయకులు వస్తారు అనేకం చెప్తుంటారని, అందులో నిజాలేవి, అబద్దాలేమిటని ఆలోచన చేయాలన్నారు. ఎవరో ఆగం చేస్తే ఆగమైపోతే మళ్లా ఐదేండ్లు మనం గోసపడక తప్పదని చెప్పారు. ఈనాడు మనం వేసే ఓటు ఐదేండ్ల మన భవిష్యత్‌ను నిర్ణయిస్తుందని, ఐదేండ్లలో అనేక మార్పులు వస్తాయని వాటిని గ్రహించాల్సిన అవసరం ఉందన్నారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం, సీఎం కేసీఆర్‌ పాలనలో కరెంటు కష్టాలు, మందుబస్తాల కోసం ఎదురుచూపులు, సాగునీటి తిప్పలు పోయాయని, రైతు ప్రభుత్వంలా ముందుకు సాగుతోందన్నారు. ఈనాడు ఎన్నికల్లో ఓట్లు దండుకునేందుకు పార్టీలు మారే విజయశాంతిని తీసుకువచ్చారని, ఆమె ఏ పార్టీలో ఉంటుందో ఆమెకే తెలియని పరిస్థితి ఉందని ఎద్దేవా చేశారు. అంతేకాకుండా కాంగ్రెస్‌లో ఎవరు ముఖ్యమంత్రి అనేదానిపైనే స్పష్టత లేదని, అలాంటి కాంగ్రెస్‌ను ఆదరిస్తే ఆగమ్యగోచరమేనని అన్నారు. బీఆర్‌ఎస్‌పార్టీ ఎన్నికల మేనీఫెస్టోను సీఎం కేసీఆర్‌ అద్బుతంగా తయారు చేశారని, రైతుబీమా తరహాలో కేసీఆర్‌ భీమా ప్రతి కుటుంబానికి అండగా నిలుస్తుందని, ప్రతి కుటుంబానికి ఐదులక్షల బీమా ఉంటుందన్నారు. అదే విధంగా ప్రతి గృహినికి మూడు వేలు, పెట్టుబడిసాయం, ఆసరా పించన్‌ల పెంపు జరుగుతుందన్నారు. ఈ పథకాలతో పాటుతాను పుట్ట లింగమ్మట్రస్టు ద్వారా సేవలు అందిస్తానన్నారు. ముఖ్యంగా ఇల్లు లేని నిరుపేదలకు గృహలక్ష్మి పథకం ద్వారా ఇల్లు మంజూరీ చేయించి ప్రభుత్వం మూడు లక్షలతో పాటు తాను కొంత సాయం చేసి దగ్గరుండి ఇళ్లు నిర్మించి ఇస్తానని అన్నారు. గ్రామాల్లో గృహలక్ష్మి పథకం ద్వారా నిర్మించి ప్రతి ఇంటిలో తన సాయం ఉంటుందని హమీ ఇచ్చారు. అంతేకాకుండా తోటగోపయ్యపల్లిని ప్రత్యేక గ్రామపంచాయతీగా ఏర్పాటు అయిందని, బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అధికారంలోకి రాంగానే వచ్చే సర్పంచ్‌ ఎన్నికలు తోటగోపయ్యపల్లిలోనే జరుగుతాయని ఆయన తెలిపారు. నాలుగేండ్లలో ఎమ్మెల్యేగా తాను చేసిన అభివృధ్ది, సేవలు మీ కళ్ల ముందే ఉన్నాయని, మళ్లీ ఆదరించి ఆశీర్వదిస్తే మీ కుటుంబసభ్యుడిలా ఐదేండ్లు సేవ చేస్తానని ఆయన హమీ ఇచ్చారు.