కలెక్టరేట్‌ ముట్టడిలో సీపీఎం నాయకుల అరెస్టు

నిజామాబాద్‌, డిసెంబర్‌ 11 : ప్రజాసమస్యల పరిష్కారానికి సీపీఎం చేపట్టిన కలెక్టరేట్‌ ముట్టడి కార్యక్రమంలో పోలీసులు  లాఠీ చార్జ్‌ చేశారు. లాఠీ చార్జ్‌లో సీపీఎం నాయకులు వీరయ్యతోపాటు సాగర్‌, జిల్లా నాయకులు దండి వెంకట్‌, రమేష్‌బాబు, గంగాధరప్ప, మరో 25మందికి లాఠీ గాయాలయ్యాయి. విద్యుత్‌ సర్ఛార్జీలను మాఫీ చేయాలని విద్యుత్‌ కోతను తగ్గించాలని, నగదు బదిలీ పథకాన్ని ఉపసంహకరించాలని తదితర 14 డిమాండ్లతో చేపట్టిన సీపీఎం  రాష్ట్ర వ్యాప్త ఆందోళనలో భాగంగా మంగళవారం కలెక్టరేట్‌కు వందలాది సంఖ్యలో ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు తరలివచ్చారు.ఈ సందర్భంగా వారు కలెక్టరేట్‌లోకి చొచ్చుకువెళ్ళేందుకు ప్రయత్నించగా పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఈ సందర్భంగా పోలీసులకు ఆందోళనకారులకు మధ్య జరిగిన తోపులాటలో కొంతమంది లాఠీ చార్జీకి గురయ్యారు. ఆందోళన కారులు పోలీస్‌ వ్యాన్‌ అద్దాలను ధ్వంసం చేయడంతో పోలీసులు రెచ్చిపోయి ఇష్టమొచ్చిన రీతిలో లాఠీలు ప్రయోగించారు. దీంతో 20మంది కార్యకర్తలకు గాయాలయ్యాయి. సీపీఎం రాష్ట్ర కార్యవర్గ కార్యదర్శి వీరయ్య చొక్కా చినిగిపోగా… కాళ్ళు చేతులపై లాఠీల గాయాలయ్యాయి. సీపీఎం నగరకార్యదర్శి రమేష్‌బాబు తలపై గాయం కావడంతో రక్త స్రావం జరిగింది. కామారెడ్డి నుంచి వచ్చిన ఒక నాయకుడి చేయి విరిగింది. పోలీసులు ఆందోళన కారులను అరెస్టు చేసి నగరంలోని ఆయా పోలీస్‌ స్టేషన్లకు తరలించారు. మహిళలను కూడా అరెస్ట్‌చేశారు. పోలీసులు జరిపిన లాఠీ చార్జీలో ముగ్గురు సిఐలు సోమనాథం, శ్రీనివాస్‌, సైదయ్యతోపాటు ఐదుగురు ఎస్సైలు, వందమంది పోలీసులు లాఠీ చార్జ్‌లో పాల్గొన్నారు.