కసబ్‌కు ఉరే సరి

కింది కోర్టు తీర్పులను సమర్థించిన సుప్రీం

భారత్‌పై దండెత్తడమే అతి పెద్ద తప్పు

మరణ శిక్షకు మించి మరోశిక్ష లేదు

పాక్‌ భూభాగం పైనుంచే దాడులకు కుట్ర

వ్యాఖ్యానించిన అత్యున్నత న్యాయస్థానం

న్యూఢిల్లీ, ఆగస్టు 29 :ముంబై దాడుల కేసులో అత్యున్నత న్యాయస్థానం సంచలన తీర్పు వెలువరించింది. ముంబై పేలుళ్ల నిందితుడు మహ్మద్‌ అజ్మల్‌ ఆమిర్‌ కసబ్‌కు కింది కోర్టు మరణశిక్ష విధించడాన్ని సుప్రీంకోర్టు సమర్థించింది. భారత్‌పైకి దండెత్తడం, దాడికి తెగబడడం కసబ్‌ చేసిన పెద్ద తప్పని న్యాయస్థానం పేర్కొంది. కసబ్‌కు మరణ శిక్ష మరో శిక్ష లేదని వ్యాఖ్యానించింది. ఎంతో మందిని హతమార్చిన ఉగ్రవాదికి ఉరే సరి అని తెలిపింది. ‘భారత్‌పైకి దండెత్తడం కసబ్‌ చేసిన పెద్ద తప్పు. అతడికి మరణ శిక్ష తప్ప మరో శిక్ష లేదు. అతడు స్పృహలో ఉండే వాంగ్మూలం ఇచ్చినట్లు మేం పరిగణిస్తున్నాం’ అని ధర్మాసనం పేర్కొంది. ముంబై దాడుల మూలాలు పాకిస్తాన్‌లోనే ఉన్నాయని కోర్టు వెల్లడించింది. కుట్ర దాయాది దేశంలోనే జరిగిందని పేర్కొంది.

బాంబే హైకోర్టు విధించిన మరణ శిక్షను సవాలు చేస్తూ 25 ఏళ్ల కసబ్‌ దాఖలు చేసిన పిటిషన్‌ను జస్టిస్‌ అఫ్తాబ్‌ ఆలం, సీకే ప్రసాద్‌లతో కూడిన ధర్మాసనం తోసిపుచ్చింది. విచారణ సజావుగా సాగలేదన్న కసబ్‌ వాదనను కొట్టిపడేసింది. తనకు న్యాయవాదిని నియమించలేదని, అందువల్ల మరణ శిక్షను యావజ్జీవ శిక్షగా మార్చాలని నిందితుడు చేసుకున్న విజ్ఞప్తిని ధర్మాసనం తోసిపుచ్చింది. న్యాయవాదిని నియమించలేదన్న సాకుతో కసబ్‌ మినహాయింపు పొందలేడని స్పష్టం చేసింది. మరోవైపు, ఇదే కసబ్‌ తరఫున న్యాయవాదిని నియమించక పోవడంపై సుప్రీంకోర్టు ప్రభుత్వంపై మొట్టికాయలు వేసింది. విచారణ ప్రాథమిక స్థాయిలో ఉన్నప్పుడే లాయర్‌ను నియమించాల్సి ఉందని పేర్కొంది. తనకు మత్తుమందు ఇచ్చి తప్పుడు వాంగ్మూలం నమోదు చేశారన్న కసబ్‌ వాదనను అత్యున్నత న్యాయస్థానం కొట్టిపడేసింది. కసబ్‌ వాంగ్మూలం పూర్తి స్పృహతో ఇచ్చినట్లుగా పరిగణించింది.

2008 నవంబర్‌ 26న కసబ్‌తో సహా మరో తొమ్మిది ముష్కరులు భారత ఆర్థిక రాజధాని ముంబైలో మారణ¬మం సృష్టించారు. కరాచీ నుంచి సముద్రం ద్వారా ముంబైలోకి చొరబడ్డ పది మంది ఉగ్రవాదులు రద్దీ ప్రాంతాలపై దాడులకు పాల్పడ్డారు. తాజ్‌ ¬టల్‌, నారీమన్‌ హౌస్‌తో పాటు ముంబై రైల్వేస్టేషన్‌లో విచ్చలవిడిగా కాల్పులకు తెగబడ్డారు. ఈ దాడుల్లో 166 మంది అసువులు బాశారు. భద్రతా బలగాలు వీరోచితంగా పోరాడి తొమ్మిది మందిని కాల్చి చంపాయి. కసబ్‌ ఒక్కడే పోలీసు కాల్పుల్లో తీవ్రంగా గాయపడి సజీవంగా పట్టుబడ్డాడు. ఈ కేసు విచారణకు ప్రభుత్వం 2009 ఏప్రిల్‌ 15న ప్రత్యేక న్యాయస్థానం ఏర్పాటు చేసింది. దీనిపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టిన ముంబై పోలీసులు అన్ని సాక్ష్యాధారాలతో కోర్టులో చార్జిషీట్‌ దాఖలు చేశారు. 658 మంది సాక్షులు వాంగ్మూలం ఇవ్వగా, కసబ్‌ను 30 మంది గుర్తించారు. ఈ దాడిపై 11 వేల పేజీలతో కూడాని భారీ చార్జిషీట్‌ను సీబీఐ కోర్టుకు సమర్పించింది. 13 నెలల పాటు విచారించిన ట్రయల్‌ కోర్టు కసబ్‌కు మరణ శిక్ష విధిస్తూ 2010 మే 6న తీర్పు వెలువరించింది. అయితే, విచారణ సరిగా జరగలేదని కసబ్‌ కింది కోర్టు తీర్పును సవాలు చేస్తూ బాంబే హైకోర్టును ఆశ్రయించాడు. కింది కోర్టు సబబేనని హైకోర్టు స్పష్టం చేస్తూ.. మరణ శిక్షను ఖరారు చేసింది. ఈ తీర్పును కూడా సవాలు చేస్తూ కసబ్‌ సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశాడు. మరణ శిక్షను యావజ్జీవ శిక్షగా మార్చాలని విజ్ఞప్తి చేశాడు. అయితే, ఆయన విజ్ఞప్తిని ధర్మాసనం తోసిపుచ్చింది. దేశంపై దండెత్తడం అతిపెద్ద తప్పని, అందుకు మరణ శిక్ష సరైందేనని వెల్లడించింది. కింది కోర్టుల తీర్పులను సమర్థిస్తూ.. మరణశిక్షను ఖరారు చేసింది.

తీర్పును గౌరవిస్తున్నా: కసబ్‌ తరఫు న్యాయవాది రాజు

సుప్రీంకోర్టు తీర్పును గౌరవిస్తున్నట్లు కసబ్‌ తరఫు న్యాయవాది రాజు రామచంద్రన్‌ తెలిపారు. కోర్టు తీర్పు వెలువరించిన అనంతరం ఆయన సుప్రీంకోర్టు ఆవరణలో విూడియాతో మాట్లాడారు. కసబ్‌ దాఖలు చేసిన అప్పీలును కోర్టు కొట్టివేసిందని, ప్రత్యేక కోర్టు తీర్పును సమర్థించిందన్నారు. న్యాయస్థానం ఇచ్చిన తీర్పును గౌరవిస్తున్నట్లు తెలిపారు. దేశానికి వ్యతిరేకంగా జరిగిన కుట్రలో కసబ్‌ పాత్ర లేదని రాజు కోర్టులో వాదించారు. నిబంధనల ప్రకారం ముంబై కోర్టు విచారణ జరపలేదని కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. నిందితుడికి న్యాయసాయం చేయడంలో మహారాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని, ఇది నిందితుడి హక్కులకు భంగం కలిగించడమేనని పేర్కొన్నారు. అయితే, ఆయన వాదనను అత్యున్నత న్యాయస్థానం తోసిపుచ్చింది. మరోవైపు సుప్రీంకోర్టు తీర్పుపై పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ గోపాల సుబ్రహ్మణ్యం హర్షం వ్యక్తం చేశారు. అంతర్జాతీయ నియమాలకు లోబడే సుప్రీం తీర్పునిచ్చిందన్నారు. కోర్టు తీర్పును భారత్‌ గర్విస్తోందన్నారు. ప్రజాస్వామ్యానికి పట్టుగొమ్మ లాంటి ఈ దేశంపై దండెత్తే వారికి తాజా తీర్పు గుణపాఠమన్నారు. అన్ని ఆధారాలతో కసబ్‌ను దోషిగా నిరూపించగలిగామన్నారు.