కాంగ్రెస్‌ మోసం చేస్తే మహోద్యమానికి

జేఏసీతో కలిసి పని చేయడానికి కేసీఆర్‌ సై
కోదండరాంతో భవిష్యత్‌ కార్యాచరణకు కేసీఆర్‌ సుముఖం
ఫౌంహౌజ్‌ భేటి వివరాలను ‘జనంసాక్షి’ కి వెల్లడించిన
ఉద్యోగసంఘాల జేఏసీ చైర్మన్‌ దేవీప్రసాద్‌
హైదరాబాద్‌, అక్టోబర్‌ 6 (జనంసాక్షి) :
కాంగ్రెస్‌ మోసం చేస్తే మహోద్యమానికి జేఏసీతో కలిసి పని చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు కేసీఆర్‌ తెలిపారని టీఎన్జీవోల అధ్యక్షుడు దేవీప్రసాద్‌ వెల్లడించారు. కోదండరాంతో భవిష్యత్‌ కార్యాచరణకు కేసీఆర్‌ సుముఖంగా ఉన్నట్లు ఆయన వివరించారు. శనివారం హైదరాబాద్‌ శివారులోని మెదక్‌ జిల్లా జగదేవ్‌పూర్‌ మండలంలోని తన ఫాం హౌజ్‌లో కేసీఆర్‌ పలువురు జేఏసీ నేతలతో సమావేశమయ్యారు. ఈ భేటిలో దేవీప్రసాద్‌ కూడా పాల్గొనగా, సమావేశపు వివరాలను ఆయన ‘జనంసాక్షి’కి ప్రత్యేకంగా వెల్లడించారు. ఈ నెలలోనే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జరుగుతుందని కేసీఆర్‌ పూర్తి నమ్మకంతో ఉన్నట్లు దేవీప్రసాద్‌ తెలిపారు. అక్టోబర్‌ చివరిలోగా కేంద్రం తెలంగాణ ఇస్తుందని, ఈ లోపు తనను పిలిస్తే మరోసారి ఢిల్లీకి వెళ్తానని కేసీఆర్‌ తెలిపారన్నారు. ఒకవేళ కేంద్రం ఈ ప్రకటనకు వెనక్కి తగ్గితే ఉద్యమాన్ని మరింత తీవ్రం చేసేందుకు జేఏసీతో కలిసి పని చేస్తానని కేసీఆర్‌ తెలిపినట్లు దేవీప్రసాద్‌ వివరించారు. తెలంగాణ ప్రజలకు అసౌకర్యం కలుగకుండా ఉద్యమం సాగాలని కేసీఆర్‌ జేఏసీ, టీఆర్‌ఎస్‌ నేతలకు సూచించారన్నారు. ఈ ఫాం హౌజ్‌ సమావేశంలో దేవీప్రసాద్‌తోపాటు టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు ఈటెల రాజేందర్‌, జి.అరవింద్‌రెడ్డి, టీఎన్‌జీవోల నేతలు స్వామిగౌడ్‌, విఠల్‌ తదితరులు పాల్గొన్నారు.