‘కారు’ ను కాదని… కాషాయం గూటికి( తెరాసను వీడి నేడే భాజపా లో చేరుతున్న మాజీ కార్పొరేటర్ బొబ్బ నవతారెడ్డి

శేరిలింగంప‌ల్లి, జోన్ 25( జనంసాక్షి): శేరిలింగంపల్లి నియోజకవర్గం చందానగర్ డివిజన్ పరిధి టిఆర్ఎస్ పార్టీలో ఎంతో చురుకైన కార్యకర్త, నాయకురాలిగా పేరును సపాదించుకుని స్థానికంగా మంచి నేతగా గుర్తింపు తెచ్చుకోవడమేగాకుండా ఐదు సంవత్సరాలు టిఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్ గా పనిచేసిన మాజీ కార్పొరేటర్ బొబ్బ నవతారెడ్డి తెరాసను వీడి బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ సమక్షంలో భారతీయ జనతా పార్టీలో చేరుతున్నారు. కార్పొరేటర్ గా పనిచేసిన ఐదు సంవత్సరాల కాలంలో పార్టీ అభివృద్ధికి, డివిజన్ అభివృద్ధికి అవిశ్రాంతంగా కృషి చేసిన నవత రెడ్డి ‘కారు’ దిగి కాషాయపు కండువాను కప్పుకోవడంతో చందానగర్ డివిజన్ తో పాటు శేర్లింగంపల్లి నియోజకవర్గం పరిధిలో రాజకీయ కుదుపులతోపాటు సమీకరణాలు ఒక్కసారిగా మారనున్నాయని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. సామాజిక వేత్తగా, సంఘసేవకురాలిగా ఇప్పటికే ఎంతో పేరును గడించిన నవతారెడ్డి ఉన్నపళంగా టిఆర్ఎస్ పార్టీని వీడుతుండడంతో ఆ పార్టీకి పూడ్చుకోలేనిలోటని, చందానగర్ డివిజన్ పరిధిలో టిఆర్ఎస్ కథ ముగిసినట్లేనని ఇతర పార్టీ నేతలు భావిస్తున్నారు. బొబ్బ నవతారెడ్డి చేరికతో శేరిలింగంపల్లి  నియోజకవర్గం పరిధిలో భాజపా మరింత బలపడుతుందని, రానున్న సార్వత్రిక ఎన్నికలలో ఇది టిఆర్ఎస్ పార్టీపై పెను ప్రభావం చూపిస్తుందని శేరిలింగంపల్లి వాసులు  స్పష్టం చేస్తున్నారు.