కార్మికుల సమస్యలపై ఎఐటియుసి రాస్తారోకో

విజయనగరం, జూలై 5 : రాష్ట్రవ్యాప్తంగా కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఎఐటియుసి జిల్లా శాఖ గురువారం ఇక్కడి ఆర్టీసీ కాంప్లెక్స్‌ వద్ద రాస్తారోకో నిర్వహించింది. ఈ సందర్భంగా వాహనాల రాకపోకలకు కొద్దిసేపు అంతరాయం ఏర్పడింది. కార్మికుల కనీస వేతనం పదివేలు చేయాలని, కాంట్రాక్టు, అవుట్‌ సోర్సింగ్‌ విధానాన్ని రద్దు చేసి కార్మికులను పర్మినెంట్‌ చేయాలని, ప్రభుత్వ రంగ పరిశ్రమల నుంచి పెట్టుబడుల ఉప సంహరణ నిలిపివేయాలని, ఇతర డిమాండ్‌లు పరిష్కరించాలని కోరుతూ ఈ కార్యక్రమం చేపట్టారు. ఎర్ర జెండాల రెపరెపలతో ఈ కార్యక్రమాన్ని చేపట్టిన ఎఐటియుసి తరఫున నాయకులు కృష్ణంరాజు, బుగత సూరిబాబు మాట్లాడుతూ ఈ నెల 10న హైదరాబాద్‌లో శ్రామిక గర్జన పేరిట భారీ ప్రదర్శన, మహాధర్నా నిర్వహిస్తున్నామని చెప్పారు. దానిని విజయవంతం చేయాలని వీరు పిలుపునిచ్చారు.