కుకట్‌పల్లిలో భారీ అగ్నిప్రమాదం

హైదరాబాద్‌, జూన్‌ 13 : రాజధాని నగరంలోని కుకట్‌పల్లిలో నిర్వహిస్తున్న ఓ ఎగ్జిబిషన్‌లో బుధవారం ఉదయం భారీ అగ్నిప్రమాదం జరిగింది. ప్రదర్శన శాలలో దాదాపు 75 స్టాల్స్‌ అగ్నికి ఆహుతయ్యాయి. పక్కనే పార్కు చేసి ఉన్న నాలుగు లారీలకు కూడా మంటలు పాకడంతో అవి దగ్ధమయ్యాయి. ప్రమాదం జరిగిన సమయంలో ఎగ్జిబిషన్‌లో జనసందోహం లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ప్రమాదానికి భిన్న కారణాలు వినిపిస్తున్నాయి. పారిశుద్ధ్య సిబ్బంది చెత్తను తగలబెట్టడంతో మంటలు చెలరేగాయని ఒక కారణం కాగా, షార్ట్‌ సర్క్యూట్‌ వల్లే ప్రమాదం జరిగిందని మరో కారణం వినిపిస్తోంది. ప్రమాద వార్త తెలిసిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన అక్కడికి చేరుకొని మంటలను అదుపు చేసేందుకు శ్రమించారు. నగరంలోనే భారీ షాపింగ్‌మాల్‌గా పేరుగాంచిన మెట్రో సంస్థ పక్కన ఈ ప్రమాదం జరిగింది. అదృష్టవశాత్తు ఆ షాపింగ్‌మాల్‌ వరకు మంటలు వ్యాపించకుండా అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా కృషి చేశారు. అయినప్పటికీ ఎగ్జిబిషన్‌లో నిర్వహిస్తున్న స్టాల్స్‌ అగ్నికి బూడిద కావడంతో కోట్లలోనే నష్టం జరిగి ఉండవచ్చని అంచనాలు వేస్తున్నారు. ముంబయి జాతీయ రహదారి పక్కనే ఉన్న ఎగ్జిబిషన్‌లో ప్రమాదం జరగడంతో ఆ రహదారిలో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. భారీగా ట్రాఫిక్‌ జాం ఏర్పడింది. ఉదయం పూట కార్యాలయాలు, ఇతర పనులపై బయటకు వెళ్లే వారితో ఆ రహదారి రద్దీగా ఉండడంతో రాకపోకలకు తీవ్ర ఇబ్బంది ఏర్పడింది. ఈ ప్రమాదం వల్ల చెలరేటిన మంటల వల్ల దాదాపు మూడునాలుగు కిలోమీటర్ల వరకు పొగలు చుట్టేయడంతో పరిసర ప్రాంతాల ప్రజలు కూడా ఊపిరాడక తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఇదిలా ఉండగా ప్రమాదవార్త తెలుసుకున్న ఎగ్జిబిషన్‌ యజమాని దిగ్భ్రాంతితో తీవ్ర అస్వస్థతకు గురయ్యారని తెలిసింది. ఆయనను సమీపంలోని ఆసుపత్రిలో చేర్పించి చికిత్సను అందిస్తున్నారు. సకాలంలో రంగంలోకి దిగి పెను ప్రమాదాన్ని తప్పించిన అగ్నిమాపక సిబ్బందిని, వారి కృషిని పలువురు అభినందించారు. ఆ శాఖ ఉన్నతాధికారి కూడా ఘటనాస్థలానికి చేరుకొని సహాయక చర్యలను పర్యవేక్షించారు. కాగా జరిగిన ప్రమాదం ఘటనపై ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు.