కెవిపి వ్యాఖ్యలపై ధ్వజమెత్తిన సురేఖ
కడప, ఆగస్టు 2 : వైయస్‌ఆర్ సిపి నాయకురాలు కొండా సురేఖ, రాజ్యసభ సభ్యుడు కెవిపి రామచంద్రరావుపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. రాఖీ పండుగ సందర్భంగా ఇడుపులపాయలోని వైయస్ ఘాట్ వద్ద రక్షాబంధం ఉంచి నివాళులు ఆర్పించారు. అనంతరం ఆయన విలేఖరులతో మాట్లాడారు. వైయస్ కుటుంబం పై దాడి జరుగుతున్నా నేటి వరకు నోరు మెదపని రామచంద్రరావు గాంధీభవన్‌లో వైయస్ ఫొటో లేదని ఆగ్రహం వ్యక్తం చేయడంలోని అంతర్యామేమిటని ఆమె ప్రశ్నించారు. వైయస్ కుటుంబంపై ముప్పేట దాడి జరుగుతున్నా ఏ మాత్రం చలించని, వైయస్ ఆత్మగా చెప్పుకుంటున్న కెవిపి ఎంత నిజాయితీ పరుడో రాష్ట్ర ప్రజలకు తెలిసిందని అన్నారు. ఇప్పటికైనా కెవిపి మొసలికన్నీరు కార్చడాన్ని మానుకోవాలని అన్నారు. వైయస్ ద్వారా అనేక ప్రయోజనాలు పొందిన వారంతా నేడు వైయస్ కుటుంబానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారని ఆమె ఆరోపించారు.