కేంద్ర మంత్రి పదవికి వీరభద్రసింగ్‌ రాజీనామా

న్యూఢిల్లీ : అవినీతి ఆరోపణల నేపథ్యంలో కేంద్ర చిన్న,మధ్యతరహా పరిశ్రమలశాఖ మంత్రి వీరభద్రసింగ్‌ తన పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు మంగళవారం ఆయన తన రాజీనామా లేఖను ప్రధానమంత్రి డాక్టర్‌ మన్మోహన్‌సింగ్‌కు సమర్పించారు. 23 సంవత్సరాల కిందట హిమాచల్‌ ప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా కొనసాగినప్పుడు వీరభద్రసింగ్‌ పెట్టుబడుల వ్యవహారంలో అవినీతికి, కుట్రకు పాల్పడినట్టుగా సిమ్లాలోని ప్రత్యేక కోర్టు సింగ్‌తోపాటు అతని భార్య ప్రతిభపై సోమవారం కోర్టు అభియోగాలు నమోదు చేసింది. ఈ ఆరోపణల కారణంగానే ఇప్పుడు కేంద్రమంత్రి పదవికి వీరభద్రసింగ్‌ రాజీనామా చేశారు. రాజీనామాకు ముందు ఆయన సోనియాగాంధీని స్వయంగా కలుసుకుని సంజాయిషీ ఇచ్చుకున్నారు. తన వ్యవహారంలో ప్రధానిని, కాంగ్రెస్‌ పార్టీని ఇబ్బందికర పరిస్థితుల్లోకి నెట్టకుండా ఉండేందుకే తన పదవికి రాజీనామా చేసినట్టు వీరభద్ర సింగ్‌ ప్రకటించారు.
వీరభద్రసింగ్‌ 1989లో హిమాచల్‌ప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అవినీతికి పాల్పడినట్టు ఆరోపణలు ఉన్నాయి. రాష్ట్రంలో పెట్టుబడులకు సంబంధించి వీరభద్రసింగ్‌ దంపతులు ఐఏఎస్‌ అధికారి మోహిందర్‌ లాల్‌తోపాటు మరికొందరు పారిశ్రామికవేత్తలతో బేరసారాలు జరిపినట్టుగా ఫోన్‌ సంభాషణల ఆడియో సీడీ ఆధారంగా ఈ కేసులు నమోదయ్యాయి. తనకు మరింత డబ్బు ముట్టజెప్పాలని వీరభద్రసింగ్‌ వీరభద్ర మోహిందర్‌తో జరిపిన సంభాషణలో అడిగినట్లు ఆ సీడీలో ఉంది. ఈ సీడీని కోర్టులో వినిపించారు. వీరభద్రసింగ్‌ ప్రత్యర్థి మాజీ మంత్రి విజయ్‌సింగ్‌ మంకోటియా 2007 మే లో ఆ సీడీని బహిర్గం చేశారు. దీని ఆధారంగా వీరభద్రసింగ్‌ దంపతులపై 2009లో కేసు నమోదైంది.2010 అక్టోబర్‌లో ప్రాసిక్యూషన్‌ ప్రత్యేక కోర్టులో కేసు వేసింది. ఈ కేసుకు సంబంధించి వీరభద్రసింగ్‌ దంపతులపై అభియోగాలు నమోదు చేయడానికి తగిన ఆధారాలున్నాయని ప్రత్యేక కోర్టు జడ్జి సోనీ సోమవారం పేర్కొన్న విషయం తెలిసిందే.