కేసీఆర్‌ను విమర్శించే హక్కు టీడీపీకి లేదు

ఆదిలాబాద్‌, జూన్‌ 13 (జనంసాక్షి):  వరంగల్‌ జిల్లా పరకాల ఉప ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఓటమి పాలైతే టీడీపీ నాయకులు తమ పదవులకు రాజీనామా చేయాలని ఆదిలాబాద్‌ ఎమ్మెల్యే జోగు రామన్న డిమాండ్‌ చేశారు. తెలంగాణ కోసం పోరాడుతున్న కేసీఆర్‌ను విమర్శించే హక్కు ఎంపీ రమేష్‌ రాథోడ్‌కు లేదని ఆయన అన్నారు. సీమాంధ్ర నేతల ప్రలోభాలకు లోంగి తెలంగాణ వాదాన్ని తాకట్టు పెట్టిన టీడీపీ నాయకులు టీఆర్‌ఎస్‌ను విమర్శించే హక్కు లేదని ఆయన అన్నారు. కేసీఆర్‌ కుటుంబంపై చేస్తున్న ఆరోపణలను నిరూపించేందుకు ఎంపీ రమేష్‌తో పాటు టీడీపీ నాయకులు బహిరంగ చర్చకు రావాలని ఎమ్మెల్యే జోగు రామన్న సవాల్‌ చేశారు.  పరకాలలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి భారీ మెజార్టీతో గెలుస్తారని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఈ ఎన్నికల్లో టీడీపీ ఎన్నో అడ్డంకులు  సృష్టించి ప్రజలను తప్పుదోవ పట్టించిన తెలంగాణ వాదమే చివరకు గెలుస్తుందని ఆయన అన్నారు.