కొనసాగుతున్న భక్తుల రద్దీ

తిరుమల, జూలై 10 : శ్రీవేంకటేశ్వరస్వామివారి సర్వదర్శనాన్ని దర్శించుకునేందుకు వెళ్లే భక్తులకు 20 గంటల సమయం పడుతున్నదని, ప్రత్యేక దర్శనం, నడకదారిన వచ్చే భక్తుల దివ్యదర్శనానికి సుమారు 10 గంటల సమయం పడుతున్నదని టిటిడి అధికారులు మంగళవారం తెలిపారు. గత నాలుగు రోజులుగా రాష్ట్రం నుండే కాక ఇతర ప్రాంతాల నుండి భక్తులు రావడంతో శనివారం నుంచి మంగళవారం వరకు భక్తుల సంఖ్య పెరిగిందని అన్నారు. తిరుమంజన సేవ కార్యక్రమంలో భాగంగా ఉదయం నుంచి భక్తులకు సర్వదర్శనం, దివ్యదర్శనం, 300 రూపాయల ప్రత్యేక దర్శనాలకు టిటిడి అనుమతి నిరాకరించడంతో భక్తులు ఉదయం నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు క్యూలైన్లల్లోనే ఉండిపోయారు. టిటిడి అన్నదాన సత్రం భక్తులకు పాలు, మధ్యాహ్నం భోజనం అందించారు. భక్తులు తలనీలాలను సమర్పించేందుకు సుమారు మూడునాలుగు గంటల సమయం పడుతున్నట్లు అధికారులు తెలిపారు.