కొలువుదీరిన రేవంత్‌ సర్కారు

` సీఎం రేవంత్‌తోపాటు 11 మంది మంత్రుల ప్రమాణం
` ప్రమాణస్వీకారం చేయించిన గవర్నర్‌ తమిళిసై
` ప్రమాణస్వీకార మహోత్సవానికి హాజరైన సోనియా,ప్రియాంక,రాహుల్‌
` ఎల్బీ స్టేడియం వేదికగా కార్యక్రమం
` భారీగా తరలివచ్చిన ప్రజలు,నాయకులు
హైదరాబాద్‌,డిసెంబర్‌7(జనంసాక్షి): తెలంగాణలో కొత్త ప్రభుత్వం కొలువుతీరింది. మొన్నటి ఎన్నికల్లో గెలిచిన కాంగ్రెస్‌ పార్టీ నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పడిరది. రేవంత్‌ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు. ఆయనతోపాటు 11మంది మంత్రులు ప్రమాణం చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రిగా ఎనుముల రేవంత్‌ రెడ్డి చేత గవర్నర్‌ తమిళసై ప్రమాణ స్వీకారం చేయించారు. ఎల్బీ స్టేడియంలో ఘనంగా జరిగిన  కార్యక్రమం లో గవర్నర్‌ తమిళిశై సౌందర రాజన్‌ సిఎంతో పాటు మంత్రులతో ప్రమాణం చేయించారు. తొలుత సిఎంగా రేవంత్‌ రెడ్డి ప్రమాణం చేశారు. తెలుగులో దైవసాక్షిగా ఆయన ప్రమాణం చేశారు. రేవంత్‌ అనే నేను అని .. పలకగానే స్టేడియం హోరెత్తిపోయింది. రేవంత్‌తో  పాటు పదకొండు మంది మంత్రులు ప్రమాణం చేశారు. రేవంత్‌ రెడ్డి తర్వాత మల్లు భట్టి విక్రమార్క ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు. తరవాత ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి , దామోదర్‌ రాజనర్సింహ, దుద్దిళ్ల శ్రీధర్‌ బాబు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పొన్నం ప్రభాకర్‌ , కొండా సురేఖ, సీతక్క,  తుమ్మల నాగేశ్వరరావు,  జూపల్లి కృష్ణారావు వరుసగా ప్రమాణం చేశారు. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఏఐసీసీ అగ్రనేతలందరూ తరలి వచ్చారు. ఏఐసిసి అధ్యక్షుడు మల్లిఖార్జున్‌ ఖర్గే, మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, రాహల్‌ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రాతో పాటు కాంగ్రెస్‌ రాష్టాల్ర ముఖ్యమంత్రులు సిద్దరామయ్య,హిమాచల్‌ ప్రదేశ్‌ సీఎం సుఖ్విందర్‌ సింగ్‌ సుఖ్‌ ఇతర నేతలు కూడా తరలి వచ్చారు. ఈ సందర్భంగా ఎల్బీ స్టేడియం కిక్కిరిసిపోయింది. ముఖ్యమైన నేతలందరూ తరలి రావడంతో హైదరాబాద్‌ మొత్తం సందడిగా మారింది.  64 మంది కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు వేదికపై నిలిచారు. ప్రమాణం చేసిన వెంటనే సిఎం రేవంత్‌ రెడ్డి, మంత్రులు కాంగ్రెస్‌ అగ్రనేతలను కలుసుకని అభివాదం చేశారు. ప్రమాణస్వీకారం అనుకున్న సమయానికన్నా 15 నిముషాలు ఆలస్యం అయ్యింది.  తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్‌ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయనున్న సందర్భంగా పలువురు ముఖ్యులు ట్రాఫిక్‌లో చిక్కుకుపోయారు. ముఖ్యంగా ఏఐసీసీ చీఫ్‌ మల్లికార్జున ఖర్గే ట్రాఫిక్‌లో ఇరుక్కున్నారు. మల్లికార్జున్‌ కార్గేతో పాటు తుమ్మల నాగేశ్వరరావు, భట్టి విక్రమార్క ట్రాఫిక్‌లో ఉండిపోయారు. గవర్నర్‌ తమిళిసై కూడా ట్రాఫిక్‌లో చిక్కుకుపోయారు. గవర్నర్‌ కాన్వాయ్‌ ఇంకా ట్రాఫిక్‌లోనే ఉండిపోయింది. ఒంటిగంటకు సభకు చేరుకోవాల్సిన గవర్నర్‌ ట్రాఫిక్‌ జామ్‌ వలన ఆలస్యమైంది. స్టేడియం వైపుకు గవర్నర్‌ కాన్వాయ్‌ను పోలీసులు ముందుకు తీసుకెళ్తున్నారు. అయితే ట్రాఫిక్‌ను క్లియర్‌ చేయడంలో పోలీసులు పూర్తిగా విఫలమయ్యారు. అసెంబ్లీ నుంచి ఎల్బీస్టేడియం వరకు భారీగా ట్రాఫిక్‌ జాం అయ్యింది. అటు ప్రమాణ స్వీకారం చేయబోయే మంత్రులు కూడా ట్రాఫిక్‌లో చిక్కుకున్నారు. ప్రమాణ స్వీకారానికి సమయం దగ్గర పడటంతో నేతల్లో టెన్షన్‌ నెలకొంది. భారీగా ట్రాఫిక్‌ జామ్‌ కావడంతో పోలీసు వైఫల్యాలపై ఉన్నతాధికారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దాదాపు రెండు కిలోవిూటర్ల మేర భారీగా ట్రాఫిక్‌ జాం అయ్యింది. చివరకు అందరినీ ఒకే వాహనంలో ఎల్బీస్టేడియానికి పోలీసులు పంపించి వేశారు. ఇకపోతే ప్రమాణానికి రాష్ట్రం నలుమూలల నుంచి భారీగా ప్రజలు తరలివచ్చారు. ప్రమాణం చేస్తున్న సమయంలో ప్రజలు కేరింతలు కొట్టారు. జై రేవంత్‌ అంటూ నినాదాలు చేశారు. స్టేడియంలో నినాదాలు మార్మోగాయి.