కోవూరు ఎమ్మెల్యే రామారావు హల్‌చల్ తన నియోజకవర్గం పట్ల వివక్ష ప్రదర్శిస్తున్నారని..
ఆర్డీవో ఆఫీసుపైకెక్కి నిరసన
ఆత్మహత్య చేసుకుంటానని బెదిరింపు
కొవూరు, నవంబర్ 22 :పశ్చిమగోదావరి జిల్లాలోని కొవూరు టీడీపీ ఎమ్మెల్యే టీవీ రామారావు గురువారం హల్‌చల్ సృష్టించారు. ప్రతిపక్ష సభ్యుడినైన తన పట్ల ప్రభుత్వాధికారులు వివక్ష చూపుతున్నారని ఆర్డీఓ ఆఫీసుపైకెక్కి హంగామా చేశారు. అధికారుల తీరు మారకపోతే ఆత్మహత్య చేసుకుంటానని హెచ్చరించారు. దీపం పథకం కింద కనెక్షన్ల మంజూరు విషయంలో తన నియోజకవర్గం పట్ల అధికారులు నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారని ధ్వజమెత్తారు. నీలం తుపాను బాధితులకు పరిహారం పెంచాలని ఆయన డిమాండ్ చేశారు. తన డిమాండ్లకు సానకూలంగా స్పందించకుంటే.. పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకుంటానని హెచ్చరించారు. అధికారులు వచ్చి హావిూ ఇవ్వడంతో కిందికి దిగివచ్చారు. అనంతరం రామారావు విూడియాతో మాట్లాడుతూ.. దీపం పథకంలో తన నియోజకవర్గ ప్రజలకు తీవ్ర అన్యాయం జరుగుతోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. దళితుడిని, ప్రతిపక్ష ఎమ్మెల్యేను కావడం వల్లే తన పట్ల వివక్ష చూపుతున్నారని ఆరోపించారు. తమకు ఓట్లు వేసిన ప్రజలే అధికార పక్షానికి వేసిన ఓటేశారన్నారు. ప్రజాస్వామ్యంలో అందరినీ సమానంగా చూడాలి కానీ, ఓట్లేసిన వారిని వేరుగా చూడడం సరికాదన్నారు. తన నియోజకవర్గ ప్రజలకు అన్యాయం జరుగుతుంటే చూస్తూ ఊరుకోనని రామారావు స్పష్టం చేశారు. వరదలు వచ్చినప్పుడల్లా ఉభయ గోదావరి జిల్లాల్లోనే ఎక్కవగా నష్టం వస్తోందన్నారు. వరద నీరు మమ్మల్ని ముంచిన తర్వాతే సముద్రంలో కలుస్తుందన్నారు. అంతా అయిపోయాక అధికారులు తీరిగ్గా వస్తున్నారని మండిపడ్డారు. వ్యవసాయ క్షేత్రాల నుంచి నీరు వెళ్లిపోయాక అధికారులు వచ్చి పంటలు ఎక్కడ మునిగాయని ప్రశ్నిస్తున్నారని ధ్వజమెత్తారు. ఇకనుంచైనా అధికారులు తీరుమార్చుకోవాలని సూచించారు. పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.10 వేల చొప్పున చెల్లిచాలని డిమాండ్ చేశారు. తనను గెలిపించిన తన నియోజకవర్గ ప్రజలకు న్యాయం చేసేందుకే తాను ఇలా చేయాల్సి వచ్చిందని వివరించారు.



