కోస్తాంధ్రలో భారీ వర్షాలు

– 48గంటల పాటు రాష్ట్రంలో ఇదే వాతావరణం
విశాఖపట్నం, జూన్‌ 27: హైదరాబాద్‌, తిరుపతి, ఇటానగర్‌, న్యూఢిల్లీ, బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ధ్రోణి ప్రభావంతో రాష్ట్రంలో కురుస్తున్న వర్షాలు మరో 48గంటల పాటు కొనసాగనున్నాయి. విదర్భ నుంచి తెలంగాణ, కోస్తా ప్రాంతాల మీదుగా తమిళనాడు వరకు కొనసాగుతున్న ఉపరితల ధ్రోణి మరింత బలపడిన నేపథ్యంలో కోస్తాంధ్రతో పాటు రాష్ట్రంలోని అనేక ప్రాంతాలలో ఒక మోస్తారు నుంచి భారీ వర్షాలు కురువనున్నాయి. ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం బలపడడంతో కోసాంధ్రలో రుతుపవనాల ప్రభావం బలం పుంజుకున్నాయి. దీంతో రానున్న 48గంటల్లో కోసాంధ్రాలో భారీగా వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయని విశాఖపట్నంలోని వాతావరణ హెచ్చరికల కేంద్రం తెలిపింది. దక్షిణ కోస్తాంధ్రలో భారీ వర్షాలు, ఉత్తర కోసాంధ్రలో పలు ప్రాంతాల్లో ఒక మోస్తారు వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. ఇప్పటి వరకు రుతుపవనాల ప్రభావంతో 75 శాతం వర్షపాతం నమోదైందని పేర్కొన్నారు. రుతుపవనాలు విఫలమయ్యాయని, ఇతర కారణాలతో వర్షం ఉండబోదనే వదంతులను నమ్మవద్దని అధికారులు స్పష్టం చేశారు. దేశ వ్యాప్తంగా జులై మొదటి వారం తర్వాత రెండు వారాల్లో ఉత్తర, దక్షిణ, పడమర, తూర్పు భాగాల్లో రుతుపవనాలు విస్తరించి రైతులకు అనువుగా ఆశించినంత వర్షాలు కురిసే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయని తెలిపారు. రాష్ట్రంలో ఇప్పటి వరకూ అందిన సమాచారం మేరకు బుధవారం తెల్లవారు జామున నందిగామలో 7సెంటిమీటర్ల వర్షం, నర్సాపురం, గన్నవరంలో 3సెం.మీ. వర్షపాతం నమోదైంది. అనేక ప్రాంతాల్లో మేఘావృతమై తేలికపాటి జల్లులు కూడా చోటు చేసుకున్నాయని అధికారులు పేర్కొన్నారు. ఇదిలా ఉండగా, రాష్ట్రంలో వర్షాభావం వల్ల నెలకొన్న దుర్భిక్ష పరిస్థితుల నుంచి విముక్తి పొందడానికి అన్ని ప్రాంతాల్లో కారీరీష్ఠి వరుణయాగాలను నిర్వహించాలని తిరుమల, తిరుపతి దేవస్థానం (తితిదే) నిర్ణయించింది. తిరుమల పార్వేటి మండపంలో నిర్వహించిన వరుణయాగం ముగింపు కార్యక్రమంలో టీటీడీ పాలకమండలి అధ్యక్షుడు కనుమూరి బాపిరాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ, గత రెండు రోజులుగా తిరుమలలో కురుస్తున్న వర్షాలు ఈ క్రతువు వైశిష్ట్యానికి నిదర్శనమన్నారు. దేవస్థానం పాలక మండలిలో చర్చించి ప్రతి ఏటా క్రమం తప్పకుండా కారీరీష్ఠయాగం నిర్వహించే విధంగా తీర్మానం చేస్తామని స్పష్టం చేశారు. రాష్ట్రంలోని జలాశయాలు నీటితో కళకళలాడాలని వరుణదేవుని ప్రార్థిస్తూ ఈ క్రతువు నిర్వహిస్తామన్నారు. వరుణయాగానికి దాతలు ముందుకు వచ్చి తమవంతు సహాయ సహకారాలు అందించాలని ఈవో పిలుపునిచ్చారు.