ఖమ్మం: ఇద్దరు రైతుల ఆత్మహత్య
జిల్లాలో సోమవారం ఇద్దరు రైతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. వివరాలు..
ముదిగొండ: పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం… ముదిగొండ మండలం, అమ్మపేట గ్రామానికి చెందిన సాయిన్ని కనకయ్య(30) నాలుగేళ్లుగా భూమిని కౌలుకు తీసుకొని వ్యవసాయం చేస్తున్నాడు. పెట్టుబడులకు డబ్బులు లేక అప్పులు చేసి మరీ రెండెకరాల్లో పత్తి, రెండెకరాల్లో పెసర వేశాడు. వర్షాలు సరిగా కురవకపోవడంతో విత్తనాలు మొలకెత్తలేదు. దీంతో మానసికంగా కుంగిపోయి ఆదివారం రాత్రి ఇంటిముందున్న ఇనుపరాడ్డుకు ఉరివేసున్నాడు. మేల్కొన్న భార్య చుట్టుపక్కల వారి సాయంతో ఆసుపత్రికి తరలిస్తుండగానే మృతిచెందాడు. కనకయ్య తండ్రి కోటయ్య ఫిర్యాదుమేరకు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. మరొక ఘటనలో సోమవారం పోకల రాజయ్య అనే రైతు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కుటుంబసభ్యులు తెలిపిన వివరాల ప్రకా రం… ఖానాపురం గ్రామానికి చెందిన పోకల రాజయ్య(45)కు నాలుగెకరాల భూమివుంది. వ్యవసాయంకోసం అప్పులు చేశాడు. సరిగా వర్షాలు కురవకపోవడం.. దీనికి తోడు పిల్లల చదువులకోసం రూ.10లక్షలవరకు అప్పులయ్యాయి. దీంతో మనోవేదన చెంది ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రాజయ్య భార్య కృష్ణకుమారి ఫిర్యాదుమేరకు ఎస్సై జంగం నాగేశ్వరరావు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఖమ్మం ప్రభుత్వాసుపత్రికి తరలించారు