ఖమ్మం ఉప ఎన్నికపై ఉన్న శ్రద్ద కరవుపై లేదు: కిషన్‌రెడ్డి

హైదరాబాద్‌,ఏప్రిల్‌25:

కరవు నివారణ చర్యల్లో నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోందని, బిజెపి మాజీ అధ్యక్షుడు, అంబర్‌పేట ఎమ్మెల్యే కిషన్‌ రెడ్డి అన్నారు. ఖమ్మం ఉప ఎన్నికపై ఉన్న శ్రద్ద కరవు పై లేదన్నారు. రాష్ట్రవ్యాప్తంగా తమ పార్టీ ప్రతినిధులుపర్యటించి కరవుపై అద్యయనం చేశారని, ఎక్కడా కనీస చర్యలు కూడా తీసుకోవడం లేదన్నారు. తెలంగాణలో తీవ్ర కరవు నెలకొన్నా పార్టీ ఫిరాయింపుదారులకు ఇచ్చిన ప్రాముఖ్యం ప్రజలకు దక్కడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇతర పార్టీల నేతలను తమ పార్టీలో చేర్చుకొనేందుకు సీఎం కేసీఆర్‌ సమయం ఇస్తున్నారే తప్ప  కరవును పట్టించుకోవడం లేదని  కిషన్‌రెడ్డి ఆరోపించారు. తాము తెలంగాణవ్యాప్తంగా పర్యటించి సమస్యలను సీఎంకు విన్నవిద్దామంటే సమయం ఇవ్వడం లేదన్నారు. ఖమ్మం ఉపఎన్నికలపై ఉన్న శ్రద్ధ కరవుపై చూపడం లేదని విమర్శించారు. తెలంగాణలో నెలకొన్న తీవ్ర దుర్భిక్షాన్ని దృష్టిలో పెట్టుకొని కేంద్ర ప్రభుత్వం రూ.791 కోట్ల నిధులను విడుదల చేస్తే, అందులో ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం మూర్ఖంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. స్థానిక సంస్థల స్ఫూర్తికి విరుద్ధంగా తెలంగాణ ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఆరోపించారు. ఇకపోతే మిగులు నిధులున్న రాష్టాన్న్రి రెండేళ్లలో అప్పుల తెలంగాణగా మార్చిన ఘనత సీఎం కేసీఆర్‌దేనని  కిషన్‌ రెడ్డి వ్యాఖ్యానించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైనప్పుడు రూ.23,000 కోట్లు మిగులు బడ్జెట్‌ ఉండేదని, 2017నాటికి రూ.2,00,000కోట్ల అప్పులు పెరుగనున్నాయని తెలిపారు. ప్రతి కుటుంబంపై రూ.1,18,000, ప్రతి తలపై రూ.35,000 అప్పు చేసిన ఘనత కేసీఆర్‌దేనని వివరించారు. అప్పుల విూద అప్పులు తెస్తున్నారని, ఏడాదికి రూ.7,000కోట్లు వడ్డీలు కట్టడానికే ఖర్చవుతుందని చెప్పారు. పోరాడి సాధించుకున్న తెలంగాణ దీని కోసమేనా?అని ప్రశ్నించారు. కరవుతో ప్రజలకు, పశువులకు తాగడానికి నీళ్లు దొరకడం లేదని, వలసలు పోతున్నారని చెప్పారు.