ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రిలో..  పసికందు మాయం!

share on facebook


– అపహరించుకెళ్లిన గుర్తుతెలియని మహిళ
– సీసీ కెమెరాల ఆధారంగా గాలింపు చేపట్టిన పోలీసులు
ఖమ్మం, నవంబర్‌26(జనం సాక్షి) : ఖమ్మం ఆస్పత్రిలో ఓ పసిబిడ్డ మాయం కలకలం సృష్టించింది. మంగళవారం ఉదయం శిశువు కిడ్నాప్‌ కు గురైంది. పాలుతాగే బిడ్డ కనిపించకుండా పోవటంతో కన్నతల్లి కన్నీరు మున్నీరుగా విలపిస్తోంది. సత్తుపల్లి నియోజకవర్గంలోని  వేంసూర్‌ ప్రభుత్వ ఆస్పత్రిలో కందుకూరుకు చెందిన రమాదేవి ప్రసవించింది. తరువాత కొద్ది రోజులకు శిశువు అనారోగ్యానికి గురవ్వటంతో మెరుగైన వైద్యం కోసం వేంసూర్‌ ఆస్పత్రి డాక్టర్లు ఖమ్మం ఆస్పత్రికి తీసుకెళ్లమని రిఫర్‌ చేశారు. వెంటనే ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకురావటం.. డాక్టర్లు అడ్మిట్‌ చేసుకుని  ట్రీట్‌ మెంట్‌ ప్రారంభించారు. ఈ క్రమంలో ఓ మహిళ బిడ్డను ఎత్తుకెళ్లిపోయింది. దీంతో రమాదేవి ఖమ్మం టూటౌన్‌ పోలీసులకు ఫిర్యాదు చేయటంతో సీసీటీవీ పుటేజ్‌ ఆధారంగా బిడ్డను ఎత్తుకుపోయిన మహిళకు గుర్తించే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు. బిడ్డను ఎత్తుకుపోతున్న మహిళ స్పష్టంగా సీసీ టీవీలో రికార్డ్‌ అయ్యింది. ఈ పుటేజ్‌ ఆధారంగా పోలీసులు సదరు మహిళ కోసం గాలిస్తున్నారు. కాగా..గతంలో కూడా ఖమ్మం ఆస్పత్రిలో ఇద్దరు పసిబిడ్డల మిస్సింగ్‌ జరిగింది. కానీ ఇప్పటి వరకూ ఆ పసిబిడ్డలు ఆచూకీ లభించనేలేదు.  అయినా ఆస్పత్రి యాజమాన్యం మాత్రం భద్రత విషయంలో ఎటువంటి చర్యలు తీసుకోకపోవటం విమర్శలకు దారి తీస్తోంది. ఇదిలా ఉంటే పసికందును ఎత్తుకెళ్లిన మహిళ కోసం పోలీసులు గాలిస్తున్నారు. తమ చిన్నారి క్షేమంగా తిరిగి రావాలని ఆ తల్లిదండ్రులు ఎదురుచూస్తున్నారు.
తెలుగు రాష్టాల్ల్రో వరుస ఘటనలు..
తెలుగు రాష్టాల్ల్రో పసిపిల్లల కిడ్నాప్‌ కేసులు కలకలం రేపుతున్నాయి. డబ్బులపై ఆశ, కుటుంబ తగాదాలు, పాత కక్షల కారణంగా ఏ పాపం తెలియని చిన్నారులు పావులుగా మారుతున్నారు. అభం శుభం తెలియని పసివాళ్లను ఎత్తుకెళ్తున్న కిడ్నాపర్లు కొన్ని సందర్భాల్లో అన్యాయంగా వారిని పొట్టనబెట్టుకుంటున్నారు. తల్లిదండ్రులు చేసిన తప్పులకు కూడా అనేక సందర్భాల్లో ముక్కుపచ్చలారని పసికందులే ప్రాణాలు కోల్పోతున్నారు. ఇటీవల చిత్తూరు జిల్లా, మదనప్లలె మండలం సీటీఎంలో ఈ నెల 22న అదృశ్యమైన ఆరేళ్ల బాలుడు అశోక్‌ ఆచూకీ ఇంకా లభించలేదు. ఇంటి ముందు ఆడుకుంటున్న అశోక్‌ను శాంతమ్మ అనే మహిళ ఎత్తుకెళ్లినట్లుగా సీసీటీవీ పుటేజీ ద్వారా పోలీసులు గుర్తించారు. బాలున్ని ఎత్తుకెళ్లిన శాంతమ్మ ఆచూకీ కోసం బృందాలుగా ఏర్పడిన పోలీసులు విస్తృతంగా గాలింపు చేపట్టారు. తాజా ఖమ్మం జిల్లా కేంద్రంలో పసికందు కనిపించకుండా పోయింది. ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రిలో పసిపాపను ఓ మహిళ అపహరించింది. 15రోజుల క్రితం పుట్టిన పాపను పాలు పట్టిస్తానంటూ ఓ మహిళ మాయమాటలు చెప్పి ఎత్తుకెళ్లింది. మరోసారి లాంటి ఘటన జరగడంతో స్థానికంగా కలకలం రేగుతుంది. ఆస్పత్రి సిబ్బంది నిర్లక్ష్యంపైనా ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Other News

Comments are closed.