గణేష్ నిమజ్జనానికి కృత్రిమ కొలనులు ఏర్పాటు… జోనల్ కమిషనర్ మమత

కూకట్ పల్లి సెప్టెంబర్ 02(జనంసాక్షి):గణేష్ నవరాత్రి ఉత్సవాల నేపథ్యంలో విగ్రహాల నిమజ్జనానికి తాత్కాలికంగా కృత్రిమ కొలనులను ఏర్పాటు చేస్తున్నట్లు జోనల్ కమిషనర్ వి.మమత పేర్కొన్నారు. ఈ సందర్భంగా శుక్రవారం ఎస్ ఈ చేన్నారెడ్డి,కూకట్పల్లి సర్కిల్ డిప్యూటీ కమిషనర్ రవీందర్ కుమార్,ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గోవర్ధన్, స్థానిక కార్పొరేటర్ మాధవరం రోజా దేవి రంగారావు లతో కలిసి ఆమె కూకట్ పల్లిలోని చిత్తారమ్మ దేవాలయ ఆవరణలో ఏర్పాటుచేసిన కృత్రిమ కొలనుల పనులను పరిశీలించారు.ఈ సందర్భంగా జోనల్ కమిషనర్ మమత మాట్లాడుతూ వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకొని చుట్టుపక్కల ఉన్న కాలనీ వాసులందరూ తమ నివాసాలలో ఏర్పాటు చేసుకున్న గణనాథులను నిమజ్జనం చేసేందుకు ఏర్పాటుచేసిన బేబీ పౌండ్లు,(కృత్రిమ కోలనుల ) చిత్తారమ్మ దేవస్థానం ఆవరణలో నిమజ్జనం చేసుకోవాల్సిందిగా కోరారు.అనంతరం రోజా దేవి రంగారావు మాట్లాడుతూ భక్తులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా ప్రమాదాలు జరగకుండా చూడాలని అధికారులకు సూచించారు.