గన్నవరంలో నూతన రన్‌వే ఆరంభం

వీడియో లింకేజి ద్వారా ప్రారంభించిన సురేశ్‌ ప్రభు
విజయవాడ,ఫిబ్రవరి12(జ‌నంసాక్షి): గన్నవరం విమానాశ్రయంలో నూతనంగా నిర్మించిన రన్‌వే అందుబాటు లోకి వచ్చింది. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి సురేష్‌ప్రభు దిల్లీ నుంచి వీడియో లింక్‌ ద్వారా మంగళవారం దీనిని ప్రారంభించారు. విమానాశ్రయ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్‌ ఎయిర్‌పోర్ట్‌ డైరెక్టర్‌ మధుసూదన్‌ రావు పాల్గొన్నారు. 2017 ఫిబ్రవరి 12న ముఖ్యమంత్రి చంద్రబాబు, నాటి కేంద్రమంత్రిగా ఉన్న ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు కలిసి రన్‌వే పనులను ప్రారంభించారు. గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయంగా మారిన నేపథ్యంలో భారీ విమాన సర్వీసులు రాకపోకలు సాగించేందుకు పొడవైన రన్‌వే అవసరం. దానికి తగ్గట్టుగా రన్‌వేను రూపొందించారు. గత డిసెంబర్‌ నుంచి అంతర్జాతీయ సర్వీసులు గన్నవరం నుంచి ఆరంభమయ్యాయి. కొత్త రన్‌వే అందుబాటులోనికి రావడంతో ప్రస్తుతం ఎయిర్‌బస్‌ ఎ380, ఎ340, బోయింగ్‌ 777, 747 వంటి పెద్ద విమానాలు రాకపోకలు సాగించేందుకు వీలు కలిగింది. నిర్ణీత కాలంలో రన్‌వేను పూర్తి చేయడంతో అంతర్జాతీయ సర్వీసులకు ఇబ్బందులు తొలగనున్నాయి. అలాగే విమాన సర్వీసులు కూడా పెరగనున్నాయి.

తాజావార్తలు