గాజాపై అణుబాంబు ప్రయోగిస్తాం

` ఇజ్రాయెల్‌ మంత్రి సంచలన ప్రకటన
` తోసిపుచ్చిన  ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహు
జెరూసలెం(జనంసాక్షి): ఇజ్రాయెల్‌`హమాస్‌ వార్‌ కీలక మలుపు తీసుకుంటోంది. గాజా స్ట్రిప్‌పై అణుబాంబు వేసే అవకాశాలను ఇజ్రాయెల్‌ పరిశీలిస్తుందని ఇజ్రాయిలీ మంత్రి అమిహై ఎలియహు ప్రకటించడం కలకలం రేపింది. గాజాపై ఇజ్రాయెల్‌ దాడులు తీవ్రతరం కావడంతో అణు బాంబును ప్రయోగించే అవకాశం ఉందా అన్న ప్రశ్నకు మంత్రి బదులిస్తూ ఈ అంశాన్ని కూడా ఇజ్రాయెల్‌ పరిశీలిస్తోందని చెప్పడం హాట్‌ డిబేట్‌కు తెరలేపింది.అణు యుద్ధానికి ఇజ్రాయెల్‌`హమాస్‌ వార్‌ దారితీస్తుందా అనే ఆందోళన నెలకొంది. కాగా ఇజ్రాయెల్‌ మంత్రి న్యూక్లియర్‌ బాంబు ప్రయోగించే అంశాన్ని పరిశీలిస్తున్నామని చేసిన వ్యాఖ్యలపై ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహు స్పందించారు. ఎలియహు వ్యాఖ్యలపై నెతన్యాహు విరుచుకుపడుతూ మంత్రి వ్యాఖ్యలు వాస్తవం కాదని తోసిపుచ్చారు.అమాయకులకు హానితలపెట్టని రీతిలో అత్యున్న అంతర్జాతీయ చట్ట ప్రమాణాలకు అనుగుణంగా ఇజ్రాయెల్‌, ఐడీఎఫ్‌ వ్యవహరిస్తున్నాయని స్పష్టం చేశారు. విజయతీరాలకు చేరేవరకూ హమాస్‌పై దాడులు కొనసాగుతాయని ట్విట్టర్‌ వేదికగా ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజిమన్‌ నెతన్యాహు పేర్కొన్నారు.
యుద్ధం తీవ్రత తగ్గాలంటే.. గాజా ప్రజలకు ఇజ్రాయెల్‌ కీలక సూచన
హమాస్‌ను అంతమొందించడమే లక్ష్యంగా గాజాపై ఇజ్రాయెల్‌ సైన్యం గ్రౌండ్‌ ఆపరేషన్‌ మొదలు పెట్టింది. వైమానిక దాడులతోపాటు, యుద్ధ ట్యాంకులతోనూ విరుచుకుపడుతోంది. దీంతో గాజాపై ఇజ్రాయెల్‌ సైనిక చర్య ఆపాలని అరబ్‌ దేశాలు డిమాండ్‌ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్‌ రక్షణ శాఖ మంత్రి యోవ్‌ గల్లాంత్‌ గాజా ప్రజలకు కీలక సూచన చేశారు. ఇజ్రాయెల్‌ దాడులు ఆగాలంటే గాజా ప్రజలే యాహ్యా సిన్వార్‌ను (హమాస్‌ గాజా చీఫ్‌) కనిపెట్టి అంతం చేయాలని, అది యుద్ధాన్ని తగ్గిస్తుందని అన్నారు. గాజాలోని ఉగ్రవాద లక్ష్యాలపై ఇజ్రాయెల్‌ దళాలు ఉత్తర, దక్షిణ ప్రాంతాల నుంచి దాడులు చేస్తున్నాయని తెలిపారు. ‘‘యాహ్వా సిన్వార్‌ను తప్పకుండా మట్టుబెడతాం. ఒకవేళ గాజా ప్రజలు.. మా కంటే ముందే అతడిని కనిపెట్టి అంతమొందిస్తే.. యుద్ధాన్ని తగ్గించినట్లవుతుంది. యుద్ధం ముగిసేనాటికి హమాస్‌ నుంచి ఇజ్రాయెల్‌కు ఎలాంటి భద్రతాపరమైన బెదిరింపులు ఉండవు. ఇకపై గాజాలో హమాస్‌ ఉండదు. భద్రతపరంగా గాజాలో ఎవరైనా ఇజ్రాయెల్‌కు వ్యతిరేకంగా వ్యవహరిస్తే.. వారిపై చర్యలు తీసుకునే సంపూర్ణ హక్కు ఇజ్రాయెల్‌కు ఉంది’’ అని గల్లాంత్‌ ఒక ప్రకటనలో తెలిపారు. శనివారం గాజాలోని శరణార్థి శిబిరంపై ఇజ్రాయెల్‌ జరిపిన దాడుల్లో 30 మంది ప్రాణాలు కోల్పోయారు. శరణార్థుల శిబిరంపై, అంబులెన్సుల వాహన శ్రేణిపై ఇజ్రాయెల్‌ దాడులు చేయడాన్ని అమెరికా ప్రశ్నించింది. సాధారణ పౌరుల ప్రాణాలకు నష్టం వాటిల్లని రీతిలో తగిన చర్యలు చేపట్టాలని సూచించింది. మరోవైపు ఇజ్రాయెల్‌`హమాస్‌ పోరులో సామాన్య పౌరుల మరణాలు పెరిగిపోవడంపై అంతర్జాతీయ సమాజం ఆందోళన వ్యక్తం చేసింది. ఇరుపక్షాలు దాడులను వెంటనే ఆపాలని అరబ్‌ దేశాలు కోరాయి. ఈ క్రమంలోనే యుద్ధానికి విరామం ఇవ్వాలని అమెరికా చేసిన సూచనపై ఇజ్రాయెల్‌ విముఖత వ్యక్తం చేసింది.