గిరిజన తండాలను పంచాయతీలుగా మార్చాలి
ఆదిలాబాద్, జూలై 19 : స్థానిక సంస్థల ఎన్నికల్లోగా రాష్ట్రంలోని అన్ని గిరిజన తండాలను గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేయాలని నంబాడ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామారావు డిమాండ్ చేశారు. ప్రభుత్వం గిరిజనులను ఓటర్లుగా చూస్తుందే తప్ప వారికి కావాల్సిన కనీస వసతులైన విద్యా, వైద్యం, పారిశుద్ధ్యం తదితర అంశాలలో శ్రద్ధ చూపడంలో విఫలమైందని ఆరోపించారు. అనేక ప్రాంతాలలో ప్రభుత్వ శాఖలలో గిరిజనులు చేయాల్సిన ఉద్యోగాలను గిరిజనేతరలు చేస్తున్నా పట్టించుకోవడం లేదని అన్నారు. గిరిజనుల సమస్యలను పరిష్కరించడంతోపాటు గిరిజన తండాలను పంచాయతీలుగా ఏర్పాటు చేయకపోతే ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు.