గౌహతి ఘటనలో మరో ఐదుగురి అరెస్టు

గౌహతి: నగరంలోని పబ్‌ ముందు ఓ యువతి బహిరంగ లైంగిక వేధింపులకు గురైన ఘటనలో మరో ఐదుగురి నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు దీంతో ఈ ఘటనలో మొత్తం అరెస్టయిన వారి సంఖ్య 11కి చేరింది. అయితే ఈ ఘటనలో వీడియో ఆధారంగా ప్రధాన నిందితుడిగా భావిస్తున్న అమర్‌జ్యోతి కలిట ఇంకా పరారీలోనే ఉన్నాడు. అతను ఒడిసాకు పారిపోయి ఉంటాడని అనుమానిసున్న పోలీసులు అక్కడ గాలింపు చర్యలు చేపట్టారు. మరోవైపు ఈ ఘటనలో బాధితురాలి గుర్తింపును బయటపెట్టిన జాతీయ మహిళ కమిషన్‌(ఎస్‌సీడబ్ల్యూ) సభ్యురాలిని ప్రభుత్వం తొలగించింది. వివరాలు వెల్లడించినందుకు ఎస్‌సీడబ్ల్యూ చైర్‌పర్సన్‌ మమతాశర్మ కూడా బాధితురాలు, ఆమె కుటుంబాన్ని క్షమాపణలు కోరారు. బాధితురాలాఇ పేరు, ఫోటోలు రాష్ట్ర సమాచార శాఖ నిన్న మీడియాకు విడుదల చేసింది. అనంతరం తప్పు తెలుసుకున్న ప్రభుత్వం వాటిని ప్రసారం చేయవద్దంటూ మీడియాను కోరింది.