గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో చీఫ్ జస్టిస్హైకోర్టు ఆవరణలో మొక్కలు నాటిన సిజె సతీష్ చంద్రశర్మ
హైదరాబాద్,నవంబర్16(జనం సాక్షి ): గ్రీన్ఇండియా చాలెంజ్ లో భాగంగా తెలంగాణ రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సతీష్ చంద్ర శర్మ మొక్కలు నాటారు. రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా చాలెంజ్ లో భాగంగా ఎజి బిఎస్ ప్రసాద్ ఆధ్వర్యంలో హైకోర్టు ప్రాంగణంలో పలువరు న్యాయవాదులు మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా గ్రీన్ ఇండియా చాలెంజ్ స్పృష్టికర్త, రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ పాల్గొన్నారు. రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సతీష్ చంద్ర శర్మ,ఇతర న్యాయమూర్తులు ఎజి బిఎస్ ప్రసాద్, అడిషనల్ ఏ జి జె.రామచందర్ రావులతో కలిసి ఎంపి సంతోష్ కుమార్ మొక్కలు నాటారు. ఈ సందర్భంగా గ్రీన్ ఇండియా చాలెంజ్ చేపట్టిన ఎంపి సంతోష్ కుమార్ ను సిజె సతీష్ చంద్ర శర్మ ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్భంగా తాను రైతు కుటుంబం నుంచి వచ్చినట్టు గుర్తు చేశారు. పర్యావరణ పరిరక్షణకు ఇలాంటి కార్యక్రమాలు ఎంతో దోహదపడుతాయని ఇలాంటి కార్యక్రమాన్ని దిగ్విజయంగా ముందుకు తీసుకువెళుతున్నందుకు ఎంపీ సంతోష్ కుమార్ పై ప్రశంసల జల్లు కురిపించారు. హైకోర్టు ప్రాంగణంలోని తాను జన్మించిన అప్పటి పాత ప్రభుత్వ జజిఖాన్ ప్రసూతి ఆసుపత్రి ప్రాంగణములో సిజే సతీష్ చంద్ర శర్మ ఇతర న్యాయమూర్తులతో కలిసి మొక్కలు నాటడం అదృష్టంగా భావిస్తున్నట్లు ఎంపి సంతోష్ కుమార్ తెలిపారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో బాగంగా హైకోర్టు ప్రాంగణములో మొక్కలు నాటడం పట్ల న్యాయమూర్తులు తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఎంపి సంతోష్ కుమార్ మొదటగా సిజే సతీష్ చంద్ర శర్మకి వృక్షవేదం పుస్తకాన్ని బహుకరించారు. అనంతరం కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్క న్యాయమూర్తి కి వృక్షవేదం పుస్తకాన్ని బహుకరించారు. ఈ కార్యక్రమం లో జస్టిస్ రాజశేఖర్ రెడ్డి, జస్టిస్ పి.నవీన్ రావు, జస్టిస్ జి.శ్రీదేవి, జస్టిస్ శ్రీ సుధ, బార్ కౌన్సిల్ చైర్మన్ ఎ.నరసింహ రెడ్డి, బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ పొన్నం అశోక్ గౌడ్, బార్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ కళ్యాణ్ రావు, జిపిలు జోగినిపల్లి సాయి కృష్ణ, సంతోష్ కుమార్, పిపిలు, సీనియర్ న్యాయవాదులు, స్టాండిరగ్ కౌన్సిల్ మెంబర్స్, ఫుడ్ కమిషన్ మెంబర్ గోవర్ధన్ రెడ్డి, గ్రీన్ ఇండియా చాలెంజ్ కో ఫౌండర్ రాఘవ, ఇతర ప్రతినిధులు పాల్గొన్నారు.