ఘనంగా ‘మనగుడి’ నిర్వహణ

తిరుమల, ఆగస్టు 2 : నందన నామా సంవత్సర శ్రావణ పౌర్ణమి సందర్భంగా రాష్ట్రంలోని 13,200 దేవాలయాల్లో దేవదాయ శాఖ, టిటిడి ఆధ్వర్యంలో ‘మనగుడి’ కార్యక్రమాన్ని అత్యంత ప్రతిష్ఠాత్మకంగా గురువారం నాడు నిర్వహించారు. నేటి తెల్లవారు జామున వేంకటేశ్వర స్వామి ఆలయంలో సుప్రభాతసేవతో ప్రారంభమైన మనగుడి కార్యక్రమం విజయవంతంగా జరిగింది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర గవర్నర్‌ నరసింహన్‌, దేవాదాయ శాఖ మంత్రి రామచంద్రయ్య, టిటిడి ఛైర్మన్‌ కనుమూరి బాపిరాజు, ఈవో ఎల్‌.వి.సుబ్రహ్మణ్యం, ఇతర ప్రముఖులు, టిటిడి ఉన్నతాధికారులు రాష్ట్రంలోని ఆయా ప్రాంతాల్లో నిర్వహించిన మనగుడి కార్యక్రమంలో పాల్గొన్నారు.
తిరుమల శ్రీవారి ఆలయంలో గురువారం ఉదయం శ్రీవారికి తిరుప్పావై సేవను టిటిడి అధికారులు ఘనంగా నిర్వహించారు. సాయంత్రం 7గంటలకు శ్రావణ పౌర్ణమి సందర్భంగా శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామి వార్లను ఆలయం నుంచి వాహన మండపంలోకి వేంచేపు చేశారు. అనంతరం ఉభయదేవేరులను వజ్ర, వైడూర్య, పీతాంబరాలతో ఆలకరించి, గరుడ వాహనంపై అధిరోహించి నాలుగు మాడ వీధుల్లో ఊరేగించారు. వేలాది మంది భక్తులకు స్వామి వారు దర్శనమిచ్చారు. తిరుమల స్థానికులు స్వామివారికి ఎదురేగి కర్పూరహారతులు ఇవ్వగా, ఉభయదేవేరులతో మలయప్ప స్వామి రథంపై ముందుకు సాగారు. రాత్రి 9గంటల అనంతరం ఆలయం లోపల శ్రీవారికి అధికారులు పూలంగి సేవను అత్యంత వైభవంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా గార్డెనింగ్‌ అధికారులు ఆలయాన్ని అత్యంత సుందరంగా వివిధ రకాల పుష్పలాతో అలకరించారు. విద్యుత్‌ శాఖ వారు ఆలయాన్ని రంగురంగుల విద్యుత్‌ దీపాలతో అత్యంత సుందరంగా ఆలకరించారు. ఈ కార్యక్రమంలో టిటిడి జెఈవో శ్రీనివాసరాజు, టివిఎస్‌వో అశోక్‌కుమార్‌, ఆలయ డిప్యూట ఈవో మునిరత్నంరెడ్డి అధికారులు, భక్తులు పాల్గొన్నారు.