చలిపంజాకు విలవిల


న్యూఢిల్లీ, జనవరి 5 (జనంసాక్షి) : చలిపులిలా పంజా విసురుతోంది. ఉష్ణోగ్రతలు సున్నా, మైనస్‌ డిగ్రీలకు పడిపోవడంతో ప్రజలు గజగజ వణికిపోతున్నారు. వృద్ధులు, చిన్నపిల్లల పరిస్థితి మరీ ఘోరంగా ఉంది. అన్ని ఇళ్లలోనూ చలిమంటలు వెలుగుతూనే ఉన్నాయి. అయినా చలికి తట్టుకోలేక ఒక్క ఉత్తరప్రదేశ్‌లోనేఇప్పటి వరకు 140 మందికి పైగా మృత్యువాతపడ్డారు. శనివారం ఒక్కరోజే 11 మంది చనిపోయారు. జనవరి ప్రవేశించినప్పటి నుంచి చలితీవ్రత పెరిగిందని, మైనస్‌ డిగ్రీల ఉష్ణోగ్రతను వృద్ధులు తట్టుకోలేకపోతున్నారని అధికారవర్గాలు పేర్కొంటున్నాయి. రాబోయే రోజుల్లో మరింతగా ఉష్ణోగ్రతలు పడిపోయే ప్రమాదముందని వారు తెలిపారు. చలికి తోడు విద్యుత్‌ సరఫరాలో అంతరాయం, సరైన ఆహారం దొరకకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.