చెత్త సమస్యలను పరిస్కరిస్తేనే గుర్తింపు

ప్లాస్టిక్‌ వ్యర్థాలను తొలగించాలి: ఛైర్మన్‌
ఏలూరు,మార్చి5(జ‌నంసాక్షి):  అధికారుల అలసత్వం వల్లే పట్టణంలో పారిశుధ్యం అత్యంత దారుణంగా తయారైందని తాడేపల్లిగూడెం మున్సిపల్‌ ఛైర్మన్‌ బొలిశెట్టి శ్రీనివాస్‌ అధికారులపై అగ్రహం వ్యక్తం చేశారు. ఓ వైపు స్వచ్చభారత్‌ దిశగా ప్రయత్నాలు చేస్తూ అవార్డులు ప్రకటిస్తున్నా ఇక్కడ మాత్రం దానిని పాటించడం లేదన్నారు. మన పట్టణాన్ని కూడా స్వచ్ఛ నగరంగా తీర్చి దిద్దుకోవాల్సి ఉందన్నారు. ప్రజలు కూడా సహకరించి పట్టణాన్ని సుందరంగా తీర్చిదిద్దేందుకు సహకరించాలన్నారు.  వార్డుల్లో చెత్త సమస్య ఎక్కువగా ఉందని, ఎన్నిసార్లు అధికారులకు చెప్పినా స్పందించడం లేదని తెలిపారు. రోడ్లపై చెత్త వేసే వారిపైనా, డ్రెయిన్‌లలో ప్లాస్టిక్‌ వస్తువులను, వ్యర్థాలను వేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, జరిమానాలు విధించాలని కౌన్సిల్‌ ఏకగ్రీవ ఆమోదం తెలిపినా అధికారులు ఆ దిశగా ఎందుకు చర్యలు చేపట్టడం లేదని ప్రశ్నించారు. 50 శాతం మేర చెత్త మార్కెట్‌ నుంచి వస్తుందని, ఈ చెత్తను వ్యాపారస్తులు
ఏలూరు కాలువలో వేస్తున్నారని, వీటితో పాటు జంతువులు వ్యర్థాలు, ప్లాస్టిక్‌, వేయడంతో పాటు బహిరంగ మలముత్ర విసర్జన చేస్తున్నారని తెలిపారు. దీన్ని అరికట్టేందుకు సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని కమిషనర్‌కు సూచించారు. పట్టణంలో పారిశుధ్యం క్షీణించిందని తెలిపారు. అధికారులు పట్టించుకోకపోవడం వల్లే ప్రజలు రోడ్లపై చెత్తను, డ్రెయినేజీల్లో ప్లాస్టిక్‌ వస్తువులను, వ్యర్థాలను, ఏలూరు కాలువలో కోడి, ఇతర జంతువుల వ్యర్థాలను వేస్తున్నారని తెలిపారు. పట్టణంలో అని వార్డుల్లో తాను పర్యటిస్తానని, ఎక్కడైనా చెత్త సమస్య కనిపిస్తే అధికారులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. చెత్తను రోడ్లపైనా, కాలువల్లో వేస్తే జరిమానా విధించాలని, అవసరమైతే కుళాయి కనుక్షన్‌ కట్‌ చేయాలని కమిషనర్‌ను ఆదేశించారు.