జమిలి ఎన్నికలపై ఏకాభిప్రాయం సాధ్యమేనా?
లెఫ్ట్ పార్టీలు ముందునుంచీ వ్యతిరేకమే
అమెరికాకు మనకూ తేడా ఎంతో ఉంది
న్యూఢిల్లీ,డిసెంబర్3 (జనంసాక్షి) : జమిలి ఎన్నికలపై మనదేశంలో ఏకాభిప్రాయం వస్తుందని అనుకోవడానికి లేదు. ఈ విషయంలో లెఫ్ట్ పార్టీలు ముందునుంచీ వ్యతిరేకిస్తున్నాయి. చట్టప్రకారం ముందుకు సాగితే తప్ప
ఈ సమస్యకు పరిష్కారం దొరక్క పోవచ్చని రాజకీయ నిపుణులు అంటున్నారు. అన్నిటికీ అమెరికాతో పోల్చుకోవడం మనకున్న అలవాటు. అది చిరకాలంగా ప్రజాస్వామ్యం వర్థిల్లుతున్న దేశమైతే…మనది ప్రపంచంలో అతి పెద్ద ప్రజాస్వామ్య దేశం. అక్కడ జమిలి ఎన్నికలు లేకపోయినా మనతో పోలిస్తే ప్రజాస్వామ్య వ్యవస్థ మెరుగ్గా వుంది. నాలుగేళ్లకొకసారి అధ్యక్ష ఎన్నికలు జరుగుతాయి. మధ్యలో రెండేళ్లకోమారు ప్రతినిధుల సభకు ఎన్నికలుంటాయి. ఆయా రాష్ట్రాల్లో ఎన్నికలు కూడా ఆ మాదిరే వుంటాయి. పైగా రాష్ట్రాల మధ్య ఎన్నికల నిబంధనల్లో, నిర్వహణలో ఎన్నో వ్యత్యాసాలుంటాయి. అయితే అధ్యక్ష ఎన్నికల కోసం అన్ని రాష్ట్రాలు ఏకమవుతాయి. మన దగ్గర ఫెడరల్ వ్యవస్థ నానాటికీ కుంచించుకు పోతుంటే అక్కడ అది నిరంతరాయంగా వర్థిల్లుతోంది. భిన్న సమయాల్లో ఎన్నికల వల్ల అభివృద్ధి కార్యకలాపాలకు అక్కడ కలగని విఘాతం మన దేశంలో ఎందుకు కలుగుతోందని లెఫ్ట్ నేతలు జమిలి ఎన్నికల ప్రస్తావన సందర్భంగా ప్రశ్నిస్తున్నారు. పాలకులు అంగీకరించకున్నా.. ఎన్నికల వల్ల విధాన సంబంధమైన కఠిన నిర్ణయాలు తీసుకోవడం వారికి సమస్యగా పరిణమిస్తోంది. ఒక రాష్ట్రంలో ఎన్నికలయ్యాక తీసుకునే విధాన నిర్ణయం మరో రాష్ట్రంలో జరిగే ఎన్నికలకు గుదిబండగా మారుతోంది. అయితే ప్రజలెదుర్కొంటున్న సమస్య వేరు. ఎప్పుడూ జరిగే ఎన్నికల వల్ల అనవసర ఉద్రిక్తతలు పెరగు తున్నాయి. నేతలు ఒకరిపై ఒకరు సవాళ్లు విసురుకోవడం, వ్యక్తిగత దూషణలకు దిగడం, పర్యవ సానంగా శాంతిభద్రతల సమస్య తలెత్తడం సాధారణ ప్రజానీకానికి సమస్యగా మారుతోంది. అలాగే ఆచరణ సాధ్యం కాని వాగ్దానాలతో మేనిఫెస్టోలు ప్రచురించి ప్రజలను ఫూల్స్ చేస్తున్నారు. డబ్బు, మద్యం పంపిణీ వంటివి సరేసరి. ఇవన్నీ ఎన్నికలను జాతరగా మారుస్తుంటే… ఆ తర్వాత ఏర్పడే చట్టసభలు సైతం కర్తవ్యనిర్వహణ లో విఫలమవుతున్నాయి. ఎంతో కీలకమైన బిల్లులనుకున్నవి కూడా అరకొర చర్చలతో ఆమోదం పొందు తున్నాయి. కొన్నిసార్లు గిలెటిన్లతో ముగుస్తున్నాయి. వాగ్దానాలు నెరవేర్చని పాలకులపై ఏవిధమైన చర్యలూ తీసుకునే అవకాశమే లేదు. ఈ దుస్థితిని మార్చడానికి పాలకులు ముందుగా ప్రయత్నించాలి. జాతీయ అంశాలు ప్రధానంగా చర్చకొచ్చే లోక్సభ ఎన్నికలతో అసెంబ్లీలను జోడిస్తే స్థానిక ఆకాంక్షలు, సమస్యలు మరుగున పడతాయి. అయితే సందర్భంను అనుసరించి శాసన, కార్యనిర్వాహక, న్యాయవ్యవస్థలు ఎన్నో కీలకాంశాలను నేర్చుకొని మరింత బలపడ్డాయని గుర్తించాలి. ఈ మూడు వ్యవస్థలపై 130 కోట్ల మంది భారతీయులకు ఉన్న విశ్వాసం కారణంగానే ఇది సాధ్యమైంది. మన రాజ్యాంగం అందించిన బలం కష్ట సమయంలోనూ సమాధానం చూపుతోంది. వాడుకలో లేని చట్టాలను తొలగించే పక్రియతో పాటు పాత చట్టాలను సవరించేటప్పుడు వాటిని రద్దు చేసే వ్యవస్థ ఉండాలి. ప్రతి పౌరుడికీ మన రాజ్యాంగంపై అవగాహన కలిగి ఉంటే విూరి మంచిది. ఈ క్రమంలో ఒకవేళ అధికారంలో వున్నవారు మెజారిటీ కోల్పోయి, ఏ పార్టీ కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేని పరిస్థితి ఏర్పడితే అక్కడి అసెంబ్లీ ఏమవుతుందన్న దానికి సమాధానం కనుక్కోవాలి. ముందుగా వరుస చర్చలతో జమిలిపై ఓ నిర్ధారణకు రావాల్సి ఉందని రాజకీయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.