జయశంకర్‌ సార్‌ పేరుమీద యూనివర్సిటీ, జిల్లా ఏర్పాటు చేయాలని కేసీఆర్‌ డిమాండ్‌

ఆంధ్రా నాయకులు వెర్రివేషాలు వేయొద్దు
హైదరాబాద్‌, జూన్‌ 21 (జనంసాక్షి):
తెలంగాణ సమాజ దుఃఖాన్ని చూసిన జయశంకర్‌ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోరుకున్నారని, అందుకు నిరంతరం తపనపడ్డారని తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కె. చంద్రశేఖర్‌రావు అన్నారు. గురువారం తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్‌ ప్రథమ వర్ధంతిని తెలంగాణ భవన్‌లో నిర్వహించారు. ఈ సందర్భంగా కేసీఆర్‌ మాట్లాడుతూ తెలంగాణ ప్రజలు కలిసికట్టుగా ఉద్యమించడం ద్వారానే తెలంగాణ సాధ్యమవుతుందని జయశంకర్‌ ఆకాంక్షించారన్నారు. ఉద్యమంలో ఆయనెప్పుడూ విశ్రమిం చలేదని, నిత్యం తనకు వెన్నుదన్నుగా నిలిచి అనేక విషయాల్లో సలహాలు, సూచనలు ఇచ్చేవారని, ఎంతటి ఉద్యమంచేసైనా తెలంగాణ సాధించాలని ఆయన కోరుకున్నారని కేసీఆర్‌ చెప్పారు. తెలంగాణలోని 80 శాతం మంది బీసీల అభ్యున్నతిని ఆయన కోరుకున్నారని అన్నారు. శిథిలమైన తెలంగాణను పునర్‌నిర్మించడమే ఆయన కోరిక అన్నారు. తెలంగాణకు మార్గం సుగమం చేసేందుకు అందరూ ప్రయత్నించాలని, కొందరు ఆంధ్రనేతలు పిచ్చిపిచ్చి వేషాలు వేస్తున్నారని సామరస్యంతో విడిపోయి తెలుగువారిగా కలిసుందామనేదే తాముకోరుకుంటున్నామన్నారు. ఆంధ్రప్రదేశ్‌ ఏర్పాడ్డాక మొదట అన్యాయం జరిగింది ఉద్యోగస్తులకేనన్నారు. ప్రొఫెసర్‌ జయశంకర్‌ పేర తెలంగాణ రాష్ట్రం ఏర్పాడ్డాక విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. జయశంకర్‌ ఆశయాల కోసం కృషి చేయడమే ఆయనకు ఇచ్చే నివాళి అని ఆయన పేర ఒక జిల్లాను కూడా ఏర్పాటు చేస్తామన్నారు. జయశంకర్‌ జీవితాన్ని పాఠ్యాంశంగా చేరుస్తామని ఆయన హామీ ఇచ్చారు. తెలంగాణ వచ్చే సమయం ఆసన్నమైందని, ఈ సమయంలోనే జయశంకర్‌ నిబద్దతను అందరూ ఆచరించాల్సిన అవసరం ఉందని అన్నారు. ఏది ఏమైనా తెలంగాణ సాధనకు మనమంతా కంకణ బద్దులం కావాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ పొలిట్‌బ్యూరో సభ్యుడు పేర్వారం రాములు, ఏకే గోయల్‌, విద్యాసాగర్‌రావు, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జయశంకర్‌ చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు.