జర్నలిస్టులపై వివక్ష ప్రదర్శించడం తప్పే విచారణ జరగాల్సిందే : బొత్స

హైదరాబాద్‌,  అక్టోబర్‌ 17 (జనంసాక్షి):

మీడియా పట్ల వివక్ష ప్రదర్శించడం మంచి సంప్రదాయం కాదని పీసీసీ అధ్యక్షుడు, రవాణా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ బుధవారం నాడు గాంధీభవన్‌లో మీడియాతో అన్నారు. ప్రధాని పర్యటనలో కొందరు జర్నలిస్టులకు, టీవీ చానళ్లకు అనుమతి ఇవ్వకపోవడం సరికాదన్నారు. ఇలా జర్నలిస్టుల పట్ల వివక్ష చూపడం సమంజసం కాదన్నారు. అంతర్జాతీయ సదస్సులో ప్రధాని పాల్గొంటున్నందున శాంతిభద్రతల విషయాలను పరిశీలించడం పోలీసుల బాధ్యత అని అన్నారు. అయితే మీడియాను నియంత్రించడం సరి కాదని అన్నారు. పోలీసులు, ఇతర అధికారులతో తాను మాట్లాడి ఏ పరిస్థితుల్లో

అలా చేయాల్సి వచ్చిందో తెలుసుకుంటానని అన్నారు. ప్రధాని పర్యటన సందర్భంగా మీడియాను ఆపారనే ఆరోపణలు నిజమని తాను భావించడం లేదన్నారు. ఏం జరిగిందో తాను తెలుసుకుంటానన్నారు. ఏది ఏమైనా కొందరు జర్నలిస్టులను అనుమతించకపోవడం దురదృష్టకరమని, ఇలాంటి చర్యలను ఖండి స్తున్నానన్నారు. మీడియాకు సంబంధించి బ్లాక్‌ లిస్టు, వైట్‌ లిస్టు అంటూ ఉండవని చెప్పారు. ముఖ్యమంత్రి ఢిల్లీ పర్యటనకు ప్రత్యేక ప్రాధాన్యత ఏదీ లేదన్నారు. పాలనపరమైన అంశాలపైనే అధిష్టానం పెద్దలు, మంత్రులతో సంప్రదించేందుకే ముఖ్యమంత్రి కిరణ్‌ ఢిల్లీ వెళ్లారన్నారు. త్వరలో కేంద్ర మంత్రివర్గం పునర్వ్యవస్థీకరణ జరగడంపై ప్రశ్నించగా కేంద్ర, రాష్ట్రాల మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణల అంశం తన పరిధిలోనిది కాదని, ప్రధాని, ముఖ్యమంత్రినే అడగాలని ఆయన సూచించారు. అయితే కేంద్ర మంత్రివర్గంలో రాష్ట్రానికి ప్రాతినిధ్యం మరింత పెరగాలని తాను కోరుకుంటున్నానన్నారు. గురువారం నుంచి రాష్ట్రంలో పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభం కానున్నదని బొత్స చెప్పారు. నామినేటెడ్‌ పదవుల భర్తీపై దృష్టి సారించామన్నారు. జిల్లాల స్థాయిలో ఇప్పటికే కసరత్తు ప్రారంభమైందని ఆయన తెలిపారు. ప్రతీ జిల్లాకు ఒక కార్పొరేషన్‌ చైర్మన్‌ పదవి, ప్రతి నియోజకవర్గంలో ఒక కార్యకర్తకు డైరెక్టర్‌ పదవి వచ్చేలా చూడడమే తమ లక్ష్యమని, ఆ దిశగా కృషి జరుగుతోందని బొత్స చెప్పారు.