జాతీయ విస్తరణకు గ్రీన్‌సిగ్నల్‌

ఖమ్మం, జూలై 19 : జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతం అభివృద్ధికి మార్గం మరింత సుగమం అవుతుంది. విజయవాడ నుండి కుంట వరకు జాతీయ రహదారి విస్తరణకు ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. ప్రస్తుతం అందరి దృష్టి ఈ రహదారి విస్తరణపైనే పడింది. కృష్ణాజిల్లా ఇబ్రహీంపట్నం పట్టణం నుంచి ఖమ్మం జిల్లా భద్రాచలం వరకు 169 కిలో మీటర్ల రహదారిని రెండు వరసల రహదారిగా విస్తరించేందుకు ప్రభుత్వం నిర్ణయించడంపై ఈ ప్రాంత వాసుల్లో హర్షం వ్యక్తమవుతుంది. ఈ రహదారిలో వాహనాల రద్దీ ఉన్నప్పటికీ అందుకు అనుగుణంగా విస్తరణ చేయకపోవడంతో ప్రయాణికులు ఇంతకాలం అనేక అవస్థలు పడ్డారు. ఈ మార్గంలో వాహనాల రాకపోకలకు ఉన్న ఇబ్బందులతో ప్రమాదాలు జరుగుతున్నాయి. ప్రదానంగా కొత్తగూడెం మండలం పెనగడప నుంచి విఎం బంజర వరకు నిత్యం బొగ్గు లారీల రద్దీతో ఎక్కడో ఓ చోట ప్రమాదాలు జరగడం సర్వసాధారణంగా మారింది. ఈ ఏడాది దాదాపు 50 మంది వరకు ప్రాణాలు కోల్పోయినట్లు అంచనా. కృష్ణాజిల్లా తిరువూరు వరకు రహదారి అధ్వాన్నంగా ఉంది. జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతంలో ఎక్కువ భాగం ఉండే ఈ జాతీయ రహదారిని మరింతగా విస్తరించడంతో అభివృద్ధి జరుగుతుందని స్థానికులు ఆశిస్తున్నారు. భద్రాచలం పుణ్యక్షేత్రానికి కూడా భక్తుల రద్దీ పెరిగే అవకాశం ఉంది.