జింబాబ్వే టూర్‌ వాయిదా వేసుకోనున్న పాకిస్థాన్‌

లా¬ర్‌ ,సెప్టెంబర్‌ 3:తమ జింబాబ్వే పర్యటనను వాయిదా వేసుకోవాలని పాకిస్థాన్‌ నిర్ణయించింది. భారత్‌తో జరిగే సిరీస్‌తో ఈ టూర్‌ క్లాష్‌ అవుతుండడమే దీనికి కారణం. షెడ్యూల్‌ ప్రకారం పాకిస్థాన్‌ రెండు టెస్టులు , మూడు వన్డేలు , రెండు టీ ట్వంటీల కోసం డిసెంబర్‌ , జనవరి నెలల్లో జింబాబ్వే టూర్‌కు వెళ్ళాల్సి ఉంది. అయితే ఇదే సమయంలో చిరకాల ప్రత్యర్థి భారత్‌తో వన్డే సిరీస్‌ ఆడాల్సి ఉండడంతో వాయిదా వేయక తప్పలేదు. భారత్‌తో క్రికెట్‌ సంబంధాల పునరుధ్ధరణ కోసం ఎప్పటినుండో ప్రయత్నిస్తోన్న పిసిబీ ఇనాళ్ళకి ఫలితం రాబట్టింది. బీసీసీఔతో చర్చించి , పలువురి రాజకీయ నాయకుల సహకారంతో ఎట్టకేలకు టూర్‌ను ఓకే చేయించుకుంది. హఠాత్తుగా సిరీస్‌ ఓకే అవడంతో ఆ సమయంలో ఉన్న జింబాబ్వే పర్యటనను వాయిదా వేసుకోవాలని పిసిబీ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతానికి భారత్‌-పాక్‌ సిరీస్‌ తేదీలు ప్రకటించకపోయినా….రెండు దేశాల క్రికెట్‌ బోర్డులు ఒక అవగాహనకు వచ్చాయి. ఇండియా టూర్‌కు రానున్న ఇంగ్లాండ్‌ టెస్ట్‌ సిరీస్‌ , వన్డే సిరీస్‌ మధ్య క్రిస్‌మస్‌ కోసం స్వదేశానికి వెళుతుంది. ఆ జట్టు తిరిగి రావడానికి 10 రోజుల సమయం ఉండడంతో ఈ గ్యాప్‌లో భారత్‌-పాక్‌ సిరీస్‌ ఆడనున్నాయి. 2007 తర్వాత రెండు దేశాల మధ్య నేరుగా జరుగుతున్న సిరీస్‌ ఇదే. ముంబై దాడుల తర్వాత భారత్‌-పాక్‌ ద్వైపాక్షిక సంబంధాలు పూర్తిగా తెగిపోవడంతో క్రికెట్‌లోనూ అదే పరిస్థితి నెలకొంది. కేవలం తటస్థ వేదికపై మాత్రమే మ్యాచ్‌లు ఆడుతున్నాయి. ప్రస్తుతం భారత్‌ సిరీస్‌తో జింబాబ్వే పర్యటనలో కాస్త మార్పులు జరగనున్నట్టు , దీనిపై ఆ దేశ క్రికెట్‌ బోర్డును రిక్వెస్ట్‌ చేసినట్టు పిసిబీ తెలిపింది. దీని ప్రకారం వచ్చే ఏడాది ప్రారంభంలో జింబాబ్వే పర్యటనతు పాకిస్థాన్‌ వెళ్లే అవకాశమున్నట్టు తెలుస్తోంది.