జిల్లాలోని ఇండ్లపై జాతీయ జెండా ఎగరాలి,

share on facebook
 ఆగస్టు 08 నుండి 22 వరకు వజ్రోత్సవాలు,
రాష్ట్ర కార్మిక, ఉపాధికల్పన శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి
 మేడ్చల్(జనంసాక్షి):
  మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా వ్యాప్తంగా భారత స్వాతంత్ర్య వజ్రోత్సవాలను పండగ వాతావరణంలో నిర్వింహించుకోవాలని ప్రతి ఒక్కరూ ఆనందోత్సాహాల మధ్య జరుపుకోవాలని రాష్ట్ర కార్మిక, ఉపాధికల్పన శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు.
శుక్రవారం జిల్లా కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో కలెక్టర్ హరీశ్తో కలిసి భారత స్వాతంత్ర్య వజ్రోత్సవాలపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ ఈనెల 8 వ తేదీ నుంచి 22వ తేదీ వరకు స్వాతంత్ర్య వజ్రోత్సవాలను నిర్వహించనున్న నేపథ్యంలో గ్రామాలు, పట్టణాలతో పాటు అన్ని చోట్ల, ఇళ్ళపై జాతీయ పతాకాన్ని ఎగురవేయాలని పిలుపునిచ్చారు.  జిల్లా వ్యాప్తంగా  మున్సిపల్ కమిషనర్లు, మేయర్లు, డిప్యూటీ మేయర్లు, ప్రతి గ్రామంలోనూ, మండలాల్లోనూ  ప్రజాప్రతినిధులు, సంబంధిత శాఖల అధికారులు  దేశభక్తి పెంపొందే విధంగా భారత స్వాతంత్ర వజ్రోత్సవాలు నిర్వహించాలని మంత్రి ఆదేశించారు. స్వాతంత్ర భారత వజ్రోత్సవాలను పురస్కరించుకొని ప్రజల్లో అడుగడుగునా దేశభక్తి భావన కల్పించేలా కార్యక్రమాలు నిర్వహించాలని  అధికారులను ఆదేశించారు. స్వాతంత్య్ర పోరాట స్ఫూర్తి ప్రజలందరిలో మేలుకొలిపేలా సమున్నతంగా, అంగరంగ వైభవంగా వీటిని నిర్వహించాలని సూచించారు. పాఠశాల విద్యార్థులు మొదలుకొని ఉద్యోగులు, ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు, యువతీయువకులు ఈ ఉత్సవాల్లో ఉత్సాహంగా పాలుపంచుకోవాలని పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరికీలో స్వాతంత్ర్య స్ఫూర్తి వచ్చేలా ఉత్సాహంగా ఉండాలని మంత్రి మల్లారెడ్డి తెలిపారు. దేశానికి స్వాతంత్ర్యం సిద్దించి వజ్రోత్సవాలు నిర్వహించుకుంటున్న ప్రస్తుత తరుణంలో ప్రభుత్వం చేపట్టబోయే అన్ని కార్యక్రమాలను విజయవంతం చేయాలని మంత్రి మల్లారెడ్డి తెలిపారు. మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా వ్యాప్తంగా రెండు లక్షల పైచిలుకు జాతీయ పతాకాలను ఇంటింటికీ అందించేందుకు సిద్దంగా ఉన్నట్లు తెలిపారు.
జిల్లా కలెక్టర్ హరీశ్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు వజ్రోత్సవాలను ఘనంగా నిర్వహించడానికి అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నట్లు కలెక్టర్ హరీశ్ స్పష్టం చేశారు. ఈ మేరకు ఈనెల 8వ తేదీ నుంచి 22వ తేదీ వరకు నిర్వహించే కార్యక్రమాల వివరాలను వెల్లడించారు. ఈనెల 8వ తేదీన భారత స్వాతంత్ర వజ్రోత్సవ ద్విసపప్తాహం ప్రారంభోత్స కార్యక్రమాలు ప్రారంభించిన అనంతరం 9వ తేదీన ఇంటింటికీ జాతీయ పతాకాల పంపిణీ, 10న వజ్రోత్సవ వన మహోత్సవంలో భాగంగా గ్రామ గ్రామాన మొక్కలు నాటడం,  ఫ్రీడమ్ పార్కుల ఏర్పాటు, 11న ఫ్రీడమ్ రన్ నిర్వహించడం ఉంటుందని కలెక్టర్ పేర్కొన్నారు. అలాగే ఆగస్టు 12న రాఖీ పౌర్ణమిని పురస్కరించుకొని ఆయా మీడియా సంస్థల ద్వారా ప్రత్యేక వజ్రోత్సవ కార్యక్రమాల ప్రసారాలకు విజ్ఞప్తి, 13న విద్యార్థులు, యువకులు, మహిళలు, వివిధ సామాజిక వర్గాల భాగస్వామ్యంతో వజ్రోత్సవ ర్యాలీలు, ఆగస్టు 14న సాయంత్రం  సాంస్కృతిక సారథి కళాకారులచే  నియోజకవర్గ కేంద్రాల్లో ప్రత్యేక సాంస్కృతిక జానపద కార్యక్రమాలు, ప్రత్యేకంగా బాణాసంచా వెలుగులు విరజిమ్మడం చేయాలని వివరించారు. అనంతరం ఆగస్టు 15వ తేదీ స్వాతంత్ర దినోత్సవం రోజున స్వాతంత్ర దినోత్సవ వేడుకలను అన్ని చోట్ల నిర్వహించాలన్నారు. ఆగస్టు 16న జిల్లా వ్యాప్తంగా ఏకకాలంలో, ఎక్కడివారక్కడ తెలంగాణ వ్యాప్తంగా సామూహిక జాతీయ గీతాలాపన, సాయంత్రం కవిసమ్మేళనాలు, ముషాయిరాల నిర్వహణ, 17వ తేదీన రక్తదాన శిబిరాల నిర్వహణ, ఆగస్టు 18న ఫ్రీడమ్ కప్ పేరుతో క్రీడల నిర్వహణ ఉంటుందని…. ఆగస్టు 19న దవాఖానాలు, వృద్ధాశ్రమాలు, అనాథ శరణాలయాలు,  జైళ్లలో ఖైదీలకు పండ్లు, స్వీట్ల పంపిణీ, 20వ తేదీన దేశభక్తిని, జాతీయ స్ఫూర్తిని ప్రతిబింభించేలా ముగ్గుల పోటీలు నిర్వహించడం జరుగుతుందని కలెక్టర్ హరీశ్ తెలిపారు. అనంతరం 21వ తేదీన అసెంబ్లీ ప్రత్యేక సమావేశం, ఇతర స్థానిక సంస్థల ప్రత్యేక సమావేశాలు, ఆగస్టు 22న హైదరాబాద్లోని లాల్బహుదూర్ స్టేడియంలో ముగింపు వేడుకలు జరుగుతాయని పేర్కొన్నారు.
జిల్లా వ్యాప్తంగా స్వాతంత్ర్య వజ్రోత్సవాలకు సంబంధించి చేపట్టబోయే కార్యక్రమాలను ముందస్తు ప్రణాళిక రూపొందించామని తెలిపారు. ఈ ప్రణాళిక ప్రకారం ముందుకెళ్ళి స్వాతంత్ర్య దినోత్సవ వజ్రోత్సవాలను విజయవంతం చేయడం జరుగుతుందని పేర్కొన్నారు. ఈ విషయంలో అధికారులు, ప్రజాప్రతినిధులందరూ సమన్వయంతో కలిసికట్టుగా పని చేయాలని పర్కొన్నారు.. ఈ సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్లు శ్యాంసన్, లింగ్యానాయక్,(FAC), డీసీపీ రక్షితామూర్తి, కుషాయిగూడ ఏసీపీ సాధన రష్మీ పెరుమాళ్, ఆర్డీవోలు రవి, మల్లయ్య,  జిల్లా అధికారులు, సంబంధిత శాఖల అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Other News

Comments are closed.