జీరోగా మిగులుతున్న వడ్డీ పథకం !

హైదరాబాద్‌, ఆగస్టు 6 : అన్నదాతల కోసం ప్రభుత్వం ఎన్ని పథకాలు చేపట్టినా ఆచరణలో వాటి ఫలితాలు వారికి అందడంలేదు. కేవలం ప్రభుత్వం తన మనుగడ కోసమే పథకాలు రూపొందిస్తుందని అవి లక్షిత వర్గాలకు అందడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. అట్టహాసంగా ప్రకటించిన పథకాలు ప్రజలకు చేరుతున్నాయా? లేదా అనే విషయమై ఆరా కొరవడింది. దీనితో పథకాలు ఉన్నా ప్రజలకు ఒరిగిందేమి లేదనే ఆపవాదనను ప్రభుత్వం మూటగట్టుకుంటోంది. ఈ కోవలోకి ముఖ్యమంత్రి ప్రకటించిన రైతులకు జీరో వడ్డీ పథకం చేరింది. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి తనదైన శైలిలో అన్నదాతల కోసం ప్రకటించిన జీరో వడ్డీ పథకం అమలుపై రైతుల్లో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పంట రుణాలపై 7 శాతం ఉన్న వడ్డీని 2007లో అప్పటి సీఎం రాజశేఖరరెడ్డి 3 శాతానికి తగ్గించి పావలావడ్డీ పథకం అమలు చేస్తున్నట్లు ప్రకటించారు. అయితే పంట రుణంతో పాటు 7శాతం వడ్డీ మొత్తాన్ని రైతులు బ్యాంకులో చెల్లించి రెన్యూవల్‌ చేసుకుంటే 3శాతం (పావలా)వడ్డీ పోగా మిగిలిన 4శాతం వడ్డీ మొత్తాన్ని ప్రభుత్వం రైతుల ఖాతాలలో జమ చేయాలని నిర్ణయించింది. 2007లో ఈ పథకం అమలైంది. 2008 మార్చి నుంచి ఇప్పటివరకు పావలావడ్డీ పథకానికి నయాపైస కేటాయించలేదు.
ఖరీఫ్‌ సీజన్‌లో పంట రుణం తీసుకున్న రైతులు మార్చి 31లోగా, రబీ సీజన్‌లో రుణం తీసుకున్న రైతులు జూన్‌ 30లోగా వడ్డీతో సహా రుణం మొత్తాన్ని బ్యాంకులో చెల్లించిన వారికే వడ్డీ రాయితీ పథకం వర్తిస్తుందని మార్గదర్శకాలలో పేర్కొన్నారు. పావలా వడ్డీ పథకం అమలుకు నాలుగేళ్లుగా నయాపైస కేటాయించకపోగా… ప్రస్తుత ప్రభుత్వం ప్రకటించిన జీరో వడ్డీ పథకంపై రైతుల్లో ఎంత మాత్రం విశ్వాసం కలగడం లేదు. పావలావడ్డీకి నిధులు కేటాయించని ప్రభుత్వం జీరో వడ్డీ పథకాన్ని అమలు చేస్తుందా..? అనే ప్రశ్న రైతుల్లో తలెత్తింది.
ప్రస్తుతం లక్ష రూపాయల వరకు భూమి తాకట్టు లేకుండానే బ్యాంకులు రైతులకు పంట రుణాలు అందించాలని నిర్ణయించాయి. ఈ మేరకు కొన్ని బ్యాంకులు ఈ రుణం అందించాయి. సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రకటన మేరకు గత రబీ సీజన్‌ నుంచే పంట రుణాలపై వడ్డీ మాఫీ పథకం అమలు కావలసి ఉన్నది. పంట సీజన్‌ ముగిసే తరుణంలోనే సీఎం మాట మార్చి రబీలో రుణం తీసుకున్న రైతులు వడ్డీ మొత్తాన్ని చెల్లిస్తే తాము రీయింబర్స్‌మెంట్‌ చేస్తామని ప్రకటించారు. ప్రస్తుత ఖరీఫ్‌ నుంచి వడ్డీ లేకుండా పంట రుణ: చెలిస్తే సరిపోతుందని వివరించారు. జీరో వడ్డీ పథకం అమలుకు ముందే సాక్షాత్తూ సీఎం భిన్నమైన ప్రకటన చేయడంతో రైతుల్లో వస్తున్న అనుమనాలకు బలం చేకూరుతోంది.
లక్ష రూపాయల వరకు పంట రుణంపై జీరో వడ్డీ, రూ.3లక్షల వరకు పావలా వడ్డీ వర్తింపచేస్తామని ప్రకటించడంతో రైతుల్లో పెరిగిన ఆశలు ప్రస్తుత ప్రభుత్వ పనితీరు చూసి ఆవిరవుతున్నాయి. జీరో వడ్డీ కాకపోయినా కనీసం పావలా వడ్డీ అమలు చేస్తే… అంతేచాలని రైతులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికైన ప్రభుత్వం కళ్లు తెరచి పావలా వడ్డీ మొత్తాన్ని విడుదల చేసి జీరో వడ్డీ పథకం సక్రమంగా అమలయ్యేలా చర్యలు తీసుకుంటేనే రైతుల విశ్వాసం పొందగలుగుతారు.