హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ జిహెచ్ఎంసి ఎన్నికలకు సిద్ధమవుతోంది. తెలంగాణ పిసిసి చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన పిసిసి ముఖ్య నేతలు, గ్రేటర్ పరిధిలోని కాంగ్రెస్ నేతలు గాంధీభవన్ లో సమావేశమయ్యారు. ముఖ్యంగా జిహెచ్ఎంసి ఎన్నికలు, రాహుల్ పర్యటనలపై చర్చ సాగింది. గ్రేటర్ లో గెలుపుకోసం ఈ నెలాఖరు నుంచి గ్రేటర్ సిటీ లో పర్యటించేందుకు కాంగ్రెస్ సిద్ధమవుతోంది.గత ఎన్నికల్లో ఎంఐఎంతో పొత్తు పెట్టుకొని జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్ సత్తా చాటింది. ఈ సారి ఎన్నికల్లో మాత్రం ఎంఐఎం ఒంటరి పోరుకు సిద్ధపడుతోంది. పార్టీ పటిష్టతతో పాటు, రాజధానిలో స్థిర పడ్డ సెటిలర్ల ను తమ వైపు తిప్పుకునేందుకు ప్రయత్నించాలని పీసీసీ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఇక గ్రేటర్లో మైనారిటీ ఓట్లు కీలకం కనుక మైనారిటీ రిజర్వేషన్ డిమాండ్ ను కాంగ్రెస్ తెరపైకి తెస్తోంది.గ్రేటర్ పరిధిలోని 24 నియోజక వర్గాల విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశాలకు పార్టీ ప్లాన్ చేస్తోంది. మరో వైపు జిహెచ్ఎంసి కమీషనర్ టీఆర్ఎస్ ఏజెంటులా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఎంఐఎం, టీఆర్ఎస్ లకు అనుకూలంగా వార్డుల విభజన జరుగుతోందని కాంగ్రెస్ ఆరోపించింది. ఏదిఏమైనా భాగ్యనగరం పై కాంగ్రెస్ జెండా ఎగుర వేసేందుకు గ్రేటర్ కాంగ్ నేతలు సిద్ధమవుతున్నారు. గ్రేటర్ ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా తీసుకొని గత వైభవం సాధించేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది.