జుత్తు లేదని ఉద్యోగంలో నుంచి తొలగింపు.

హైదరాబాద్‌, జూన్‌ 27 : ఆమె ఓ ముస్లిం యువతి. సామాజిక స్పృహ మెండుగా ఉంది. అదే ఆమె కొంపముంచింది. సామాజిక సేవగా క్యాన్సర్‌ అవేర్‌నెస్‌ కార్యక్రమం కోసం తన అందమైన శిరోజాలనే కత్తిరించేసింది. జుత్తులేని గుండుతో నువ్వు ఉద్యోగం చేయటానికి పనికిరావంటూ ఉద్యోగం నుంచి తీసేశారు. ఇంతకీ ఆమె చేసే ఉద్యోగం మలేసియన్‌ టివి ఛానల్‌లో ఫ్రీలాన్స్‌ యాంకర్‌. ఎన్‌టివి7 సంస్థకు చెందిన ఈ ఛానల్‌లో ‘మహ్మద్‌ రద్జి’ యాంకర్‌గా గత కొన్నేళ్లుగా పనిచేస్తుంది. నేషనల్‌ క్యాన్సర్‌ కౌన్సిల్‌వారు క్యాన్సర్‌ అవేర్‌నెస్‌ కార్యక్రమాన్ని చేపట్టింది. సామాజిక సేవ మెండుగా ఉన్న మహ్మద్‌ రద్జి ఈ కార్యక్రమంలో పాల్గొనాలని ఉత్సాహపడి అందుకు తన శిరోజాలను కత్తిరించేసి గుండు చేయించుకున్నది. స్త్రీకి శిరోజాలే అందం.అలాంటి శిరోజాలనే సామాజిక సేవ కోసం, ప్రజల్లో చైతన్యం కోసం త్యాగం చేసింది. ఈ త్యాగం వెనుక బలమైన కారణం లేకపోలేదు. ఎందుకంటే మహ్మద్‌ రద్జి తండ్రి, అంకుల్‌, ఆమె స్నేహితులు చాలా మంది క్యాన్సర్‌ మహమ్మారికి చనిపోయారు. ఆ బాధతో ఈ వ్యాధి పట్ల చైతన్యం పెంచేందుకు ఈ కార్యక్రమంలో పాల్గొంది. అయితే ఈ కార్యక్రమంలో పాల్గొనేముందు ఆమె టివి యాజమాన్యాన్ని సంప్రదించింది. జుత్తు లేకుండా నువ్వు ఉద్యోగంలో కొనసాగటానికి వీల్లేదని ఖరాకండిగా చెప్పేశారు. విగ్‌ పెట్టుకొని ఉద్యోగం చేస్తానని బతిమిలాడినా అంగీకరించలేదు. కొన్నాళ్లకు జుత్తు వస్తోంది. ఇదికాకపోతే మరో ఉద్యోగాన్నైనా సంపాదిస్తాననే ఆత్మవిశ్వాసంతో ఆమె ఈ సామాజిక కార్యక్రమంలో పాల్గొన్నది. ఓ సామాజిక కార్యక్రమం కోసం ఉపాధిని పోగొట్టుకుంటారా?అని ప్రశ్నిస్తే నాకు అల్లానే సర్వస్వం. ఇస్లాం మతాన్ని ప్రేమిస్తాను. మా మతం పరులకు సేవ చేయమని బోధించింది. రోజుకు ఐదుసార్లు మనసారా ప్రార్ధించే అల్లానే నన్ను ఆదుకుంటాడు అని ఎంతో ఆత్మస్థయిర్యంతో సమాధానమిచ్చింది.