తప్పుడు సమాచారం ఇస్తే కఠిన చర్యలు

రేషన్‌ కార్డుదారులు ఆన్‌లైన్‌లో ఫిర్యాదు చేయొచ్చు జేసి పి.భాస్కర్‌
శ్రీకాకుళం, జూలై 19 : ట్యాంకర్‌ నుంచి కిరోసిన్‌ డెలవరీ చేయకుండా తప్పుడు సమచారం ఇస్తే కఠిన చర్యలు తప్పవని జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ పోలా భాస్కర్‌ హెచ్చరించారు. కిరోసిన్‌ సరఫరాను ‘ఈ-వాణి’లో పొందుపరుస్తామని తెలిపారు. కిరోసిన్‌ కంపెనీల నుంచి హోల్‌సేల్‌ డీలర్లకు, అక్కడ నుంచి రేషన్‌ దుకాణాలకు సరఫరా జరుగుతున్న తీరుపై ఎస్‌.ఎం.ఎస్‌.ల ద్వారా తెలియజేయాల్సి ఉంటుందన్నారు. కలెక్టర్‌ కార్యాలయంలోని సమావేశమందిరంలో కిరోసిన్‌ హోల్‌సేల్‌ వర్తకులు, సీఎస్‌డీటీలు, ఎంఎల్‌ఎస్‌ పాయింట్‌ ఇన్‌ఛార్జిలతో ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ రాయితీ సరఫరా చేస్తున్న కిరోసిన్‌ పక్కతోవ పడుతుందని, దీనిని నియంత్రించేందుకు చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. ‘ఈ-వాణి’పై స్వయం సహాయక సంఘాలకు అవగాహన కల్పిస్తామన్నారు. ఇప్పటికే ప్రతి రేషన్‌ డిపో పరిధిలోని 25 ఫోన్‌ నెంబర్లను సేకరించామన్నారు. ఈ నెంబర్లకు వాయిస్‌ కాల్‌ ద్వారా రేషన్‌ దుకాణాలకు వచ్చిన సరుకుల వివరాలు తెలియజేస్తామన్నారు. అంగన్వాడీలకు సంబంధించి సీడీపీవోలకు, మధ్యాహ్న భోజనానికి సంబంధించి ప్రధానోపాధ్యాయులకు, వసతిగృహాలకు సహాయ సంక్షేమాధికారులకు వాయిస్‌ కాల్‌ను పంపిస్తామన్నారు. ఈ సమావేశంలో డీఎస్‌వో కె.నిర్మాలాభాయి, పౌరసరఫరాల సంస్థ డీఎం డి.మార్కెండేయులు, ఆర్డీవోలు జి.దామోదరరావు, బి.దయానిధి, వి.విశ్వేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

తాజావార్తలు