తమిళ తంబి హెచ్చరికతో యూపీఏ బుజ్జగింపులు

చెన్నై, మార్చి 18 (జనంసాక్షి) :
డీఎంకే చీఫ్‌ కరుణానిధి హెచ్చరికతో యూపీఏ ప్రభుత్వం బుజ్జగింపుల ప్రక్రియకు తెరతీసింది. ఈనెల 22న జెనీవాలో జరిగే ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల మండలి సమావేశంలో శ్రీలంకు వ్యతిరేకంగా ఓటు వేయాలని, లేనిపక్షంలో యూపీఏ నుంచి వైదొలిగి, మద్దతు ఉపసంహరించుకుంటామని ఆయన యూపీఏ చైర్‌పర్సన్‌ సోనియాగాంధీ, ప్రధాని మన్మోహన్‌సింగ్‌కు లేఖ రాసిన విషయం తెలిసిందే. ప్రత్యేక ఈలం కోరుకుం టున్న తమిళులపై
అక్కడి ప్రభుత్వం, సైనికులు జరిపిన మారణఖాండను మానవ హక్కుల మండలి సమావేశంలో ఎత్తిచూపాలి, లంక ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేయాలని కరుణ డిమాండ్‌ చేశారు. ఎల్‌టీటీఈ అధినేత ప్రభాకరన్‌ కుమారుడు బాలచంద్రన్‌ దారుణ హత్యను ఓ అంతర్జాతీయ మీడియా బయటపెట్టడంతో ప్రపంచం దృష్టి మొత్తం లంక వైపునకు మళ్లింది. అక్కడ మానవ హక్కుల ఉల్లంఘన యథేచ్ఛగా సాగుతోందని, పాలకులు అమాయక పౌరులకు ఇష్టం వచ్చినట్లుగా కాల్చి చంపుతున్నారని కరుణానిధి ఇటీవల ఆగ్రహం వ్యక్తం చేశారు. మరో ఏడాదిలో పార్లమెంట్‌ ఎన్నికలు వస్తుండంతో ఈ అంశాన్ని ఎన్నికల అస్త్రంగా ఉపయోగించుకోవాలని తమిళనాడులోని అన్ని రాజకీయపక్షాలు ప్రయత్నిస్తున్నాయి. ఈ నేపథ్యంలో మానవ హక్కుల సమావేశాన్ని ఉపయోగించుకొని కేంద్రంపై ఒత్తిడి పెంచాలని కరుణ పావులు కదుపుతున్నారు. అయితే సీమాంతర ఉగ్రవాదం విషయంలో అన్ని దేశాలు ఒకే విధానం అలంబించాలని, ఇలాంటి వ్యవహారాల్లో పట్టుబట్టడం సరికాదని చెప్పేందుకు కాంగ్రెస్‌ పార్టీకి చెందిన ప్రముఖులు పి. చిదంబరం, ఏకే ఆంటోని, గులాంనబీ ఆజాద్‌ సోమవారం చెన్నైకి చేరుకొని ఆయనతో సంప్రదింపులు జరిపారు. ఐక్యరాజ్యసమితిలో శ్రీలంకకు వ్యతిరేకంగా అమెరికా ప్రవేశపెట్టనున్న తీర్మానంలో ఏముందో తెలియకుండా, గుడ్డిగా నిర్ణయం తీసుకోలేమని, అన్నీ సమీక్షించిన తరువాతే తాము నిర్ణయం తీసుకుంటామని ప్రధాని మన్మోహన్‌సింగ్‌ చెప్పారు. ఈ విషయాన్నే కరుణానిధికి వివరించి అర్థం చేసుకోమని మంత్రులు కోరారు. అయితే స్పష్టమైన హామీ ఇచ్చి తీర్సాల్సిందేనని కరుణ పట్టుబట్టారు. దీంతో వారి చర్చలు అసంపూర్తిగా ముగిశాయి.