తర్వలో తెలంగాణ

కేంద్రం నుంచి నాకు సంకేతాలు అందుతున్నాయి.
బోగు గని కార్మిక విజయోత్సవ సభలో : కేసీఆర్‌
హైదరాబాద్‌, జూలై 11(జనంసాక్షి):
త్వరలోనే తెలంగాణ వస్తుంది.. సాధించే రోజు దగ్గరలోనే ఉందని, అందుకు సంబంధించిన సంకేతాలు ఉన్నాయని టిఆర్‌ఎస్‌ అధినేత కె.చంద్రశేఖరరావు అన్నారు. తెలంగాణ భవన్‌లో బుధవారంనాడు సింగరేణి విజయోత్సవ అభినందన సభ జరిగింది. ఇటీవల జరిగిన సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల్లో టిబిజికెఎస్‌ విజయం సాధించిన విషయం తెలిసిందే. నేటి అభినందనసభలో కెసిఆర్‌ మాట్లాడారు. టిబిజికెఎస్‌ గెలుపునకు కృషి చేసిన సింగరేణి కార్మికులను అభినందిస్తున్నానన్నారు. నాలుగున్నర కోట్ల తెలంగాణ ప్రజల పక్షాన కూడా వారికి అభినందనలు తెలుపుతున్నానన్నారు. సింగరేణి వల్ల లక్షలాది రూపాయల లాభాలు వచ్చినప్పటికీ యాజమాన్యం మాత్రం కార్మికులకు సరైన వసతులు కల్పించడం లేదన్నారు. తెలంగాణ రాగానే సింగరేణి నిర్వహణ బాధ్యతను తానే తీసుకుంటానన్నారు. మరో 30, 40 గనులను ఏర్పాటు చేసుకుందాం. అంతేగాక మరో 40 వేల మంది కార్మికులకు ఉద్యోగాలిస్తాం. సకల జనుల సమ్మె సమయంలో సింగరేణి ఉద్యోగులకు ప్రభుత్వం ఇవ్వాల్సిన రెండు నెలల జీతాన్ని వడ్డీతో సహా చెల్లిస్తామని చెప్పారు. అంతేగాక కార్మికుల ఇబ్బందులను తెలుసుకునేందుకు ఒక్కో మైను వద్ద ఒక్కో అధికారిని ప్రత్యేకంగా నియమిస్తామన్నారు. సింగరేణి ఎన్నికల్లో గెలుపొందిన టిబిజికెఎస్‌ ప్రత్యేకంగా ఒక కారును కొనుగోలు చేయాలన్నారు. కార్మికులకు ఇబ్బంది తలెత్తినప్పుడు ఆ కారులోనే సేవలు అందించాలని సూచించారు. తెలంగాణ రాగానే కార్మికులకు అనేక వసతులు కల్పిస్తామన్నారు. సింగరేణి కార్మికులకు ఆదాయపు పన్ను నుంచి మినహాయింపు వచ్చేలా కృషి చేస్తామన్నారు. సింగరేణి ప్రాంతాల్లో ఎమ్మెల్యేలను గెలిపించే బాధ్యత కొంగర్ల మల్లయ్యదేనని ప్రకటించారు. సింగరేణిని మరింత లాభాల బాటలో పయనించేలా కృషి చేస్తానన్నారు. తెలంగాణ కోసం పోరాడేది టిఆర్‌ఎస్‌ పార్టీయేనని చెప్పారు. టిఆర్‌ఎస్‌ పార్టీ గౌరవం, ఖ్యాతి హిమాలయం అంత ఎత్తుకు ఎదిగిందని చెప్పారు.